తమిళ చిత్రసీమలో చిన్మయి మీటూ పేరుతో సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు బాగోతంతో పాటు సీనియర్ నటుడు రాధారవి వేధింపుల్ని ట్విట్టర్ ద్వారా ఎండగట్టి తమిళ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. అలాంటి చిన్మయిపై గత నెల రోజులుగా ఎదురుదాడి జరుగుతోంది. మీటూ పేరుతో తమ జీవితాల్ని చిన్మయి బజారుకీడ్చడం జీర్ణించుకోలేకపోతున్న వైరముత్తు, రాధారవి ఇప్పడు ఆమెకు చుక్కలు చూపిస్తున్నారు.
తమ ప్రమేయం లేదంటూనే తెలివిగా చిన్మయిని పరోక్షంగా దెబ్బమీద దెబ్బతీస్తున్నారు. ఇటీవల చిన్మయిని డబ్బింగ్ సంఘం నుంచి తొలగించి తన కసి తీర్చుకున్న రాధారవిపై చిన్మయి ట్విట్టర్ వేదికగా విరుచుపడింది. ఈ ఉదంతం సద్దమనగక ముందే చిన్మయికి మరో షాక్ తగిలింది. జీవీ ప్రకాష్‌కుమార్ నటించిన తాజా తమిళ చిత్రం `సర్వం తాళమయం`. ఈ చిత్రం కోసం తను పాడిన పాటకు క్రెడిట్ ఇవ్వలేదని చిన్మయి అసంతృప్తిని వెల్లగక్కింది.
రాజీవ్ మేనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించారు. ఈ చిత్రంలోని `మాయ..మాయ.. `అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్ర బృందం ఇటీవల విడుదల చేసింది. ఈ పాట తెలుగు వెర్షన్‌ను చిన్మయి ఆలపించింది. తమిళ వెర్షన్‌లో షాషా త్రిపాఠి పాడింది. ఆమెకు తమిళ వెర్షన్‌లో క్రెడిట్ ఇచ్చిన చిత్ర వర్గాలు తెలుగు వెర్షన్ లో మాత్రం చిన్మయి పేరును తొలగించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన చిన్మయి గాయనిగా తనను జీ స్టూడియోస్ అవమానించిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చిన్మయికి క్రెడిట్ ఇవ్వకపోవడం వెనక వైరముత్తు హస్తం వుందని కోలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు.