స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా `ఎన్టీఆర్` రూపొందుతున్న విషయం తెలిసిందే. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను `ఎన్‌టిఆర్ కథానాయకుడు`, `ఎన్‌టిఆర్ మహానాయకుడు` పేర్లతో రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను ఈ నెల 16న తిరుపతిలో అట్టహాసంగా నిర్వహించాలని డేట్‌ను లాక్ చేశారు. ఇందుకు సంబంధించిన పనులను కూడా మొదలుపెట్టారు. కానీ ఆ తేదీన ఫంక్షన్ చేయడం లేదని, ఆ రోజున ట్రైలర్‌ను మాత్రమే విడుదల చేస్తున్నట్లు తాజా సమాచారం.
ఉన్నపలంగా ఫంక్షన్ కు బ్రేకేయడానికి ప్రధాన కారణం తెలంగాణ ఎన్నికలే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి టీడీపీ తెలంగాణలో పోటీకి దిగిన విషయం తెలిసిందే. 7న పోలింగ్ జరిగిన తరువాత 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఒక వేళ ఈ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తే ఇక్కడి రాజకీయాల్లో చక్రం తిప్పేది టీడీపీనే కాబట్టి ఫలితాల తరువాత బాలకృష్ణ, ఫంక్షన్‌కు రావాల్సిన చంద్రబాబు నాయుడు బిజీబిజీగా వుంటారు కాబట్టి ముందు అనుకున్న ప్రకారం 16న `ఎన్‌టిఆర్` ప్రీరిలీజ్ ఫంక్షన్ ని నిర్వహించడం వీలుకాదు.
దాంతో ఆలోచనలో పడ్డ బాలయ్య ఆ రోజున ట్రైలర్‌ను విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇక ఎన్నికల ఫలితాల తరువాత కూటమికి అనకూలంగా వస్తే ఒకలా లేకుంటే మరోలా ఫంక్షన్ ఏర్నాట్లు చేయాలని భావిస్తున్నారట. దాని కోసం ఈ నెల 21వ తేదీని రిజర్వ్ చేసుకున్నట్లు తాజా సమాచారం. ఫలితాలు తారుమారైతే ఫంక్షన్ వుంటుందన్నది కూడా అనుమానమే అని మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది.