తెలుగు భాష, వాచకం మీద విశేషమైన పట్టు, పరిజ్ణానం ఉన్న నందమూరి బాలకృష్ణ ఇచ్చే తెలుగు స్పీచ్ లకే జనాలు విరగబడి నవ్వుకున్న సందర్భాలు కోకొల్లలు. అలాంటిది బాలయ్య ఈమధ్య కొత్తగా హిందీ లెక్చర్లు మొదలెట్టాడు. అప్పుడోసారి మోడీని తిడుతూ బాలయ్య ఇచ్చిన హిందీ స్పీచ్ ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ.. అదే తరహాలో బాలయ్య హిందీ స్పీచ్ ఇంకోసారి వైరల్ అయ్యింది.
ఈసారి ఆయన హిందీలో మాట్లాడడం కాదు.. మన జాతీయ గీతమైన "సారే జహాసే అచ్ఛా"లోని మొదటి రెండు లైన్లు పాడదామనుకొని మధ్యలో కొన్ని పదాలు మింగేసి, కొన్ని ఎగరేసి "బుల్ బుల్" దగ్గర ఆగిపోయాడు. రెండుమూడుసార్లు కంప్లీట్ చేద్దామని ప్రయత్నించినప్పటికీ పెద్దగా వర్కవుట్ అవ్వకపోవడంతో "బుల్ బుల్" అంటూనే ఆపేశాడు. ఆ సమయంలో ఆయన చుట్టుపక్కల ఉన్నవాళ్లకి ఆ స్పీకర్ల పుణ్యమా అని ఏమీ అర్ధం కాలేక నవ్వలేదు కానీ.. ప్రస్తుతం ఆ "బుల్ బుల్" వింటున్నవారందరూ పడి పడి నవ్వుతున్నారు.
బాలకృష్ణ హైద్రాబాద్ లో తేదేపా తరుపున ప్రచారం చేస్తున్న తరుణంలో ఈ హంగామా జరగడంతో.. తెలుగుదేశం పార్టీ వర్గాలతోపాటు.. తెలుగు దేశం తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కూడా బాలయ్య రావడం వల్ల ప్రచారం ఊపందుకోకపోవడం పోగా.. ఇలా జనాలు బాలయ్య స్పీచ్ కి నవ్వుతూ, ప్రతిపక్షాలు ఎద్దేవా చేయడానికి మాత్రం తట్టుకోలేకపోతున్నారు. మరి ఈ విషయాన్ని పార్టీ సీనియర్లు సీరియస్ గా తీసుకొంటారో లేదో చూడాలి. అయినా.. తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయకుల్లో ఒకరైన బాలయ్య ఈ విధంగా పబ్లిక్ లో నవ్వులపాలు కావడం మాత్రం బాధాకరం.