"కృష్ణార్జున యుద్ధం" పరాజయం పాలవ్వడం, ఆ తర్వాత విడుదలైన "దేవదాస్" నాని మునుపటి చిత్రాల రేంజ్ లో హిట్ అవ్వకపోవడంతో నాని బాబు కాస్త స్పీడ్ తగ్గించాడు. ప్రస్తుతం కేవలం తన తాజా చిత్రం "జెర్సీ" మీద మాత్రమే పూర్తి కాన్సన్ ట్రేషన్ తో వర్క్ చేస్తున్నాడు నాని. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ రెండు సినిమాల అనంతరం నాని ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. అది కూడా తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో.
నిజానికి.. ఇంద్రగంటికి "బందిపోటు" డిజాస్టర్ తర్వాత "జెంటిల్ మెన్" చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కల్పించి తన గురుదక్షిణ ఇచ్చుకున్న నాని మళ్ళీ ఆయన దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నాడు. అయితే.. ఈసారి నానీని సోలో హీరోగా కాకుండా ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు ఇంద్రగంటి. ఆల్రెడీ స్టోరీ ఫిక్స్ అయిపోయిన ఈ చిత్రం ఫైనల్ స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయట. ఈ మల్టీస్టారర్ లో మరో కథానాయకుడిగా మలయాళ టాప్ హీరోల్లో ఒకడైన దుల్కర్ సల్మాన్ నటించనున్నాడని తెలుస్తోంది. "దుల్కర్ సల్మాన్" మొదటి తెలుగు అనువాద చిత్రమైన "ఒకే బంగారం"కి నాని డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత "మహానటి" చిత్రంతో దుల్కర్ తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొన్నాడు.
ఒకవేళ ఇందరగంటి ప్లానింగ్ ప్రకారం ఈ మల్టీస్టారర్ గనుక సెట్ అయ్యిందంటే.. దుల్కర్ నటిస్తున్న సినిమా కాబట్టి ఎలాగూ మలయాళంలో రిలీజ్ చేస్తారు కావున.. నాని తెలుగుతోపాటు మలయాళంలోనూ మార్కెట్ పెంచుకున్నట్లుగా ఉంటుంది. చూద్దాం మరి ఈ ప్రొజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో.