దక్షిణాది ప్రేక్షక హృదయాల్లో క్రేజీ స్టార్ గా పేరుతెచ్చకున్నాడు మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. మమ్ముట్టి తనయుడిగా తెరంగేట్రం చేసినా తనదైన మార్కు నటతో అనతి కాలంలోనే నటుడిగా, హీరోగా మంచి పేరు తెచ్చకున్నాడు. మణిరత్నం రూపొందించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ `ఓకే బంగారం` చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న దుల్కర్ ఇటీవల సీనియర్ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ రూపొందించిన `మహానటి`తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.
తెలుగులో ఈ రెండు చిత్రాలతో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్న దుల్కర్‌కు తెలుగులో తాజాగా మరో అవకాశం దక్కబోతోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు ఓ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. స్క్రిప్ట్ పూర్తయి చాలా రోజులే అవుతున్నా దిల్ రాజు మిగతా ప్రాజెక్టుల్లో బిజీగా వుండటం వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. ఇందులో నాని ఓ హీరోగా నటించనుండగా మరో హీరో కోసం చాలా మందిని పరిశీలించిన దిల్ రాజు `మహానటి`తో ఆకట్టుకున్న దుల్కర్ అయితేనే బాగుంటుందని భావించాడట. ఇటీవలే దుల్కర్‌ను దిల్ రాజుకలిసి కథ వినిపించాడని, నానితో కలిసి నటించడానికి దుల్కర్ అంగీకరించాడని తెలిసింది.