అక్కినేని హీరోలంటే రొమాంటిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. అక్కినేని నాగేశ్వరరావు నుంచి నాగచైతన్య వరకు రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలతోనే హిట్ లు సాధించారు. హీరోలుగా నిలబడ్డారు. కానీ ఆ పంథాను బ్రేక్ చేయాలన్నది అక్కినేని మూడవ తరం హీరో అఖిల్ అక్కినేని కోరిక. అందుకే తొలి ప్రయత్నంగా చేసిన `అఖిల్` సినిమా కోసం యాక్షన్ కథనే ఎంచుకున్నాడు. అయితే దర్శకుడి టేకింగ్, కథలో వున్న లోపాల కారణంగా సక్సెస్సాను ధించలేకపోయాడు. ప్రస్తుతం తన ఫ్యామిలీ హీరోలకు కలిసొచ్చిన రొమాంటిక్ కథనే నమ్ముకుని వెంకీ అట్లూరితో`మిస్టర్ మజ్ను` చేస్తున్న అఖిల్ తన తదుపరి చిత్రాన్ని మాత్రం యాక్షన్ నేపథ్యంలోనే చేయాలనుకుంటున్నాడట.
దీని కోసం అఖిల్ ఊరమాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనును ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ పల్స్ తెలిసిన బోయపాటి అయితేనే తన కోరిక నెరవేరుతుందని, మాస్ హీరోగా తనని నిలబెడతాడని అఖిల్ గట్టిగా నమ్ముతున్నాడట. బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్‌చరణ్‌తో `వినయ విధేయ రామ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతోంది. దీని తరువాత బాలకృష్ణతో సినిమా చేయనున్న బోయపాటి దాని తరువాతే అఖిల్‌తో సినిమా చేస్తాడని తాజాగా వినిపిస్తోంది. మాస్ హీరోగా నిలబడాలన్న అఖిల్ కోరికని బోయపాటి అయినా ఫుల్‌ఫిల్ చేస్తాడో లేదో చూడాలి.