ఈమధ్యన ఎక్కడ ఏ భాష చూసినా పైరసీ భూతం రకరకాలుగా నిర్మాతలను భయపెట్టేస్తుంది. కోట్ల రూపాయలతో సినిమాలు చెయ్యడం... ఆ సినిమా విడుదలైన నెక్స్ట్ షోకే పైరసీ కావడంతో.. భారీ బడ్జెట్ నిర్మాతలు ఈ పైరసీ భూతానికి వణికి పోతున్నారు. తాజాగా తమిళనాట తమిళ రాకర్స్ విడుదలయ్యే సినిమాలకు ఛాలెంజ్ విసురుతుంది. సినిమా విడుదలైన ఫస్ట్ షోకే తమ వెబ్ సైట్ లో ఆ సినిమా లింక్స్ పెడతామని ఓపెన్ ఛాలెంజ్ విసురుతుంది. విశాల్ వంటి నటులు ఈ పైరసీ భూతాన్ని పెకిలించి వేద్దామని ఎంతగా ట్రై చేసినా.. ఆ పైరసీ భూతం మాత్రం మరింతగా రెచ్చిపోతుంది.
తాజాగా విజువల్ వండర్ గా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన శంకర్ మూవీ 2.ఓ సినిమా నిన్న గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా విడుదలైన ఫస్ట్ షోకే పైరసీ రక్కసి 2.ఓ సినిమా లింక్ ని తమ వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. కళ్ళ నిండుగా గ్రాఫిక్స్, విజువల్ వండర్స్ ఇలా సినిమా చూస్తున్నంత సేపు మరో లోకంలో విహరిస్తున్నట్టుగా ఉన్న 2.ఓ సినిమా ఇలా ఆన్ లైన్లో రావడంతో రజిని అభిమానులు షాకవుతున్నారు. 3డి లో 2.ఓ వీక్షించిన ప్రతిఒక్కరు 2.ఓ 3 డి ఎఫెక్ట్స్ అదుర్స్ అంటూ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తుంటే.. ఇప్పుడు 2.ఓ సినిమా ఆన్ లైన్ లోనే దొరుకుతుందనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది.
మరి కోట్లాది రూపాయలతో తెరకెక్కించిన 2.ఓ నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమా పైరసీ అవ్వడంతో షాకయ్యారట. అసలు 2.ఓ విడుదలకు ముందే తమిళ రాకర్స్ పైరసీ వెబ్ సైట్ 2.ఓ విడుదలైన మరుక్షణమే ఆన్ లైన్ లో విడుదల చేస్తామని ఛాలెంజ్ చేసింది. మరి చెప్పినట్టుగానే సినిమా మొత్తం ఆన్ లైన్ లో పెట్టేసింది. మరి భారీ ఓపెనింగ్స్ తెచ్చిన 2.ఓ సినిమా ఇలా పైరసీ అవ్వడంతో.. కలెక్షన్స్ లో కోత పడే అవకాశం చాలా ఉంది. ఇప్పటికే బాహుబలితో పోటీ అంటున్న రజిని అభిమానులు ఈ పైరసీ విషయం తెలిసినప్పటి నుండి కాస్త కంగారులో ఉన్నారు.