ఏపీలో వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందా? లేదా? అనే విషయం పక్కనపెడితే వైఎస్ జగన్ అసలు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఇష్టపడలేదు. జగన్, కేసీఆర్‌ల బంధం మోదీ, అమిత్‌షాలు కలిపిందేనని ప్రజల్లో సందేహాలు రావడానికి జగన్ వైఖరి కూడా ఒక కారణం. తనపై హత్యాయత్నం జరగగానే జగన్ నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయాడు. మోదీని విమర్శిస్తే తన అవినీతి చిట్టా బయటకు వచ్చి జైలుకు మరలా పోవాల్సివస్తుందని, అలాగే కేసీఆర్‌తో తేడా వస్తే తనకు విపరీతంగా ఆస్తులున్న హైదరాబాద్‌లో కేసీఆర్ తనకి చుక్కలు చూపిస్తాడనే ఆయన భయంగా టిడిపి నాయకులు అంటున్నారు. కనీసం ఆంధ్రా వాళ్లని కేసీఆర్ తిడుతున్నా కూడా జగన్ దానిపై స్పందించకపోవడం దారుణం. ఇక తమకు తెలంగాణ అవసరం లేదని, తమ దృష్టంతా ఏపీపైనే అని వైసీపీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ లోలోపల మాత్రం వారు, వారి కరపత్రిక అయిన సాక్షిలు మాత్రం లోపాయికారీగా మహాకూటమి ఓటమి పాలు కావాలని, కేసీఆర్ మరలా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ విషయం పోసాని, కమెడియన్ పృధ్వీల మాటల ద్వారా స్పష్టం అవుతోంది. వారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒకటేనని చెప్పడం మానేసి, మహాకూటమి అధికారంలోకి వస్తే అమరావతి నుంచి పాలన జరుగుతుందని విమర్శలు గుప్పించడం దారుణమనే చెప్పాలి.
తాజాగా పృథ్వీ మరో కామెడీ పొలిటీషియన్ అయిన బండ్ల గణేష్‌పై సినిమా టైప్ సెటైర్లు గుప్పించాడు. ఆయన మాట్లాడుతూ, బండ్లగణేష్ ఎంతో విచిత్రంగా ప్రవర్తించాడు. ఎన్నికల్లో మహాకూటమి గెలవకపోతే బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానని అన్నాడు. ఆయనను కాపాడాలని పోలీసులకు ముందుగా చెప్పాలి. ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోవాలి అని ఎద్దేవా చేస్తూనే, అమెరికా అధ్యక్షుడితో కూడా ఫొటో దిగగలిగే శక్తి ఉన్నోడు గణేష్. నాకు అంత శక్తి లేదు. గణేష్ మంచి నిర్మాత. నాకు మంచి స్నేహితుడు. ఆయన రాజకీయాలలోకి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కేసీఆర్ మగాడు. విజయమే లక్ష్యంగా ఆయన ప్రయాణం ఉంది. అధికారం కోసమే మహాకూటమి ఏర్పడింది. కేసీఆర్‌కి అలాంటి అనైతిక కలయికలు లేవు.
తెలంగాణలో మహాకూటమికి ఓటేస్తే పాలన అమరావతి నుంచి ఉంటుంది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే కేవలం ఐదారు సీట్లు మాత్రమే వచ్చేవి అని ఓ రాజకీయ ధురంధనునిగా మాట్లాడాడు. గణేష్ రాజకీయాలలోకి రావడం ఆశ్యర్యం వేసిందని చెప్పిన పృధ్వీ తానెందుకు రాజకీయాలలోకి వచ్చాడో చెప్పాలి. ఇంకా మహాకూటమి నయం. నేరుగా పొత్తులు పెట్టుకున్నారు. అంతేగానీ మజ్లిస్, మోదీలను చెరో వైపు కూర్చోబెట్టుకుని అనైతిక పొత్తుకు మహాకూటమి పాల్పడలేదనే చెప్పాలి.