ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ వంటి వారిని నాటి తరం ప్రేక్షకులు బాగా అభిమానించేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ని అయితే దైవసమానుడిగా భావించి కొలిచేవారు. కానీ ఆ తర్వాత మరలా దేవుడిలా నీరాజనాలు అందుకున్న హీరోలు తక్కువే అయినా నిన్నటితరంలో కూడా మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానులు ఉండేవారు. ఎన్టీఆర్ తర్వాత అన్నయ్య అని పిలిపించుకున్న నటుడు చిరంజీవినే కావడం విశేషం. ఇక నేటితరం ప్రేక్షకులు ఎక్కువగా వారి వారసులను అభిమానిస్తూ ఉంటారు. కానీ అది కేవలం సినిమాల వరకే. కానీ దేవుడిలా కొలుచుకునే వారు తక్కువనే చెప్పాలి.
ఇలాంటి సమయంలో ఏకంగా నాటితరం వారిని కూడా బాగా ఆకట్టుకుంటున్న స్టార్‌గా మహేష్‌బాబు ఓ అరుదైన ఘనత సాధించాడు. నాటితరం వారు నేటి హీరోలను చూసి పెదవి విరిచే సమయంలో ఓ పాతతరం ముసలావిడ మహేష్‌బాబుని విపరీతంగా అభిమానిస్తూ ఉంది. రాజమండ్రికి చెందిన రేలంగి సత్యవతి వయసు సెంచరీ దాటింది. ఈ 106ఏళ్ల వృద్దురాలుకి మహేష్‌బాబు అంటే వల్లమాలిన అభిమానం. మహేష్‌బాబుని చూడాలనేది ఆమె కోరిక. ఈ విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకున్న మహేష్‌బాబు తాజాగా ఆ ముసలావిడను కలుసుకున్నాడు.
అభిమానంగా ఆమె అక్కున చేరి పోవడమే కాదు.. ఆమె ఆశీస్సులు కూడా అందుకున్నాడు. ఆమె ప్రేమాభిమానాలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని ఆనందంతో చెప్పుకొచ్చాడు. ఇది తన కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని ఓ మధురానుభూతి అని ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబవుతూ చెప్పుకురావడం విశేషం.