సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే మన సినిమా వారు కూడా ఎంతో ఉత్సాహంగా ఏదో ఒక పార్టీ తరపున బిజీగా మారుతుంటారు. ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. కానీ ఈసారి తెలంగాణ ఎన్నికల విషయంలో మాత్రం సినీ ప్రముఖుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా పరిస్థితి మారింది. ఎందుకంటే ఇప్పటికే మన సినీ ప్రముఖులు పలువురుని తెలంగాణలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం బాగా మచ్చిక చేసుకుంది. వారిని హైదరాబాద్ వదలకుండా చేయడానికి వారు చేసే పనులను చూసి చూడనట్లు వదిలేస్తోంది. నాగార్జున ఎన్ కన్వెక్షన్ నుంచి డ్రగ్స్ విషయంలో కూడా మొదట చూపించిన జోరు టిఆర్‌ఎస్ ఆ తర్వాత చూపించలేదు. ఇక సినిమా వారిని ఆకట్టుకోవడంలో, వారికి ప్రాధాన్యత ఇవ్వడంలో కేటీఆర్ ముందుంటున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలియని గట్టి పోటీలో ఏదో పార్టీకి మద్దతు తెలిపి అధికారంలోకి రాబోయే పార్టీతో తమకు వైరం ఎందుకుని మన సినీ పెద్దలు మౌనం వహిస్తున్నారనేది నగ్నసత్యం. వారిలో కొందరికి టిఆర్‌ఎస్‌పై కోపం ఉన్నా కూడా కేసీఆర్ అసలే నియంత. రేపు ఆయనే అధికారంలోకి వస్తే తన ప్రత్యర్ధులను ముప్పు తిప్పలు పెట్టడం ఖాయం. అదే ఏపీ ఎన్నికల్లో అయితే ఈ బాధ లేదు. ఎందుకంటే తాముండేది తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కాబట్టి, అందునా చంద్రబాబు ఏమీ నియంత కాదు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా మారినా వచ్చే సమస్యలంటూ ఏమీ ఉండవు. ఇక కాంగ్రెస్ పార్టీ, మహాకూటమి తెలంగాణలో అధికారంలోకి వచ్చినా వారి నుంచి కూడా పెద్దగా వేధింపులు ఎదురయ్యే పరిస్థితి లేదు.
ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుతం నియంతలా పాలించగలిగిన నాయకులు లేరు. అది కాంగ్రెస్‌లో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డితోనే పోయింది. కాబట్టి తెలంగాణ ఎన్నికల విషయంలో మాత్రం మన సినిమా వారు ఆచితూచి మనకెందుకులే అనుకుంటూ ఉన్నారు. అయితే ఒక్క జగపతిబాబు మాత్రం పూర్తిగా తెలుగుదేశంకి మద్దతు తెలపకపోయినా కూడా నందమూరి కుటుంబంతో ఉన్న సత్సంబంధాల వల్ల అది కూడా కూకట్‌పల్లిలో హరికృష్ణ కుమార్తె నందమూరి అలియాస్ చుండ్రు సుహాసిని నిలబడటంతో ఆమె ఎన్నికల్లో గెలవాలని, తన మద్దతు ఆమెకేనని తేల్చిచెప్పాడు. ఆమె నిజాయితీ కలిగిన వ్యక్తి.. సమస్యలకు స్పందించే గుణం ఉన్న మంచి వ్యక్తి కావడంతోనే తాను ఆమెకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాడు.
సాధారణంగా సినీ ప్రముఖులందరు జూబ్లీహిల్స్‌లో ఉంటారు. కానీ జగపతిబాబు స్వయాన కూకట్‌పల్లిలో ఓ లగ్జరీ ప్లాట్‌ని తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు. కాబట్టి స్థానికునిగా తన మద్దతు సుహాసినికేనని ఆయన ప్రకటించాడు. మరి మిగిలిన చోట్ల ఆయన ఎవరికైనా మద్దతు పలుకుతాడా? లేక కేవలం కూకట్‌పల్లికి, నందమూరి సుహాసినికే పరిమితం అవుతాడా? అనేది వేచిచూడాల్సివుంది...!