బాహుబలి సినిమాలో కథానాయకుడికి, ప్రతి నాయకుడికి సమానమైన హోదా ఇచ్చాడు దర్శకధీరుడు రాజమౌళి. అసలైతే విలన్ రానా చివరిలో చనిపోతాడు కానీ.. లేదంటే బాహుబలి ప్రభాస్ తో సమానమైన స్థానం అయితే దక్కేది. ఇప్పటికి బాహుబలి ప్రభాస్ తో పాటుగా రానాని సమానంగా పొగుడుతున్నారు అంతా. అంతలా రానాకీ, ప్రభాస్ కి సరిసమానమైన పాత్రలను రాజమౌళి బాహుబలిలో సృష్టించాడు. మరి తాజాగా తెరకెక్కుతున్న RRR లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఢీ కొట్టబోయే ప్రతినాయకుడు ఎలా ఉండబోతున్నాడు? రాజమౌళి ఆ విలన్ పాత్రని ఎలా రాసుకున్నాడు? అనే ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకుల్లోనే కాదు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ చరణ్ ఫ్యాన్స్ లో బాగా మొదలైంది.
అయితే RRRలో ప్రతి నాయకుడు పాత్రకి మొదట్లో టాలీవుడ్ హీరో రాజశేఖర్ పేరు, అలాగే రంగస్థలం, అరవింద సమేతలలో విలన్ గా పవర్ ఫుల్ పాత్రల్లో ఇరగదీసిన జగపతి బాబు అని అన్నారు కానీ.. తాజాగా ఎన్టీఆర్, చరణ్ లను ఢీ కొట్టబోయే ఆ కొండ ని రాజమౌళి బాలీవుడ్ నుండి దింపుతున్నాడనే టాక్ మొదలైంది. అయితే బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ పేరు RRR విలన్ కేరెక్టర్ కోసం పరిశీలిస్తున్నారని చెప్పినప్పటికీ.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి RRR కోసం కన్నడ నుండి స్టార్ హీరో యష్ దిగబోతున్నాడనే టాక్ అయితే ఫిలింసర్కిల్స్ లోను, సోషల్ మీడియాలోనూ మొదలైంది.
ప్రస్తుతం కన్నడలో స్టార్ హీరో రేంజ్ లో ఉన్న యష్.. RRR విలన్ గా రాజమౌళి ఫైనల్ చేసేస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం యష్ నటించిన కేజీఎఫ్ చిత్రం పలు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండగా.. తాజాగా విడుదలైన కేజీఎఫ్ ట్రైలర్ పలు రికార్డులను నమోదు చేసిన విషయం తెలిసిందే. మంచి ఫిజిక్ .. విలక్షణమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న యష్‌ని రాజమౌళి తన RRR లో విలన్ పాత్రకి ఎంపిక చేశాడని వార్తలు వస్తున్న తరుణంలో స్వయంగా యష్ ఈ వార్తలపై స్పందించడం విశేషం. RRR లో విలన్ పాత్రకి సంబంధించి తనని ఎవరూ కలవలేదని, ఆ వార్తల్లో నిజంలేదని యష్.. ట్విట్టర్ ద్వారా తెలిపాడు. మరి యష్ క్లారిటీ ఇచ్చేశాడు కాబట్టి.. రాజమౌళి ఈ విలన్ పాత్రకి బాలీవుడ్ అజయ్ దేవగన్‌ని ఫైనల్ చేస్తాడో.. లేదంటే టాలీవుడ్ విలన్ జగపతి బాబుని తీసుకుంటాడో... లేదంటే ఇంకేవరినైనా తీసుకొచ్చి సర్‌ప్రైజ్ చేస్తాడో తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.