బ్లాక్‌బస్టర్ బండ్ల గణేష్.. ఇప్పుడు ఓ పార్టీకి అధికార ప్రతినిధిగా మారాడు. అవును ఇది నిజం. బండ్ల గణేష్ ఏంటి. పార్టీ అధికార ప్రతినిధి అవ్వడం ఏంటి? అని ఆశ్చర్యపోవద్దు. నిజంగా ఇది నిజం. కొన్ని రోజులు క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకుని అఫీషియల్‌గా కాంగ్రెస్ పార్టీలో బండ్ల గణేష్ చేరిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత న్యూస్ ఛానెళ్లలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టిలో పడేలా ప్రయత్నాలు చేసిన బండ్ల గణేష్.. జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే సీటును ఆశించగా.. అసలే కూటమి కొట్లాటలో ఉన్న కాంగ్రెస్ బండ్లను పక్కన పెట్టేసింది. అయినా సరే.. బండ్ల ప్రయత్నాలు చేస్తూనే ఉండటంతో.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అతనికి అధికార హోదా ఒకటి ఇచ్చి.. సైలెంట్ చేసింది.
బండ్ల గణేష్‌ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఆ పార్టీ అధికార ప్రతినిధి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకంతో ఓ లెటర్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అంతే అందరూ ఇప్పుడు బండ్ల గణేష్‌కు పోటీ చేయకుండానే పదవి వచ్చేసిందని చెబుతూ.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు.