తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. నేతలంతా నామినేషన్లు పూర్తి చేసి, ఎవరికి తోచిన విధంగా వారు ప్రచారాన్ని మొదలెట్టారు. ఇప్పటికే రకరకాల ప్రచారాలతో నేతలు హోరెత్తిస్తున్నారు. రాబోయే తెలంగాణ ఎన్నికలలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కూటమిల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే జరుగుతున్న పరిణామాలు రోజురోజుకి హాట్ హాట్‌గా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. గెలుపు కోసం నేతలు ఈ నెల రోజులు తొక్కని గడప, ఇవ్వని హామీ అంటూ లేకుండా.. రణరంగాన్ని మరింత రంజుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఈ ఎన్నికల గురించి నేతలే కాకుండా ప్రజలు కూడా చాలా బాధ్యతగా తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై టాలీవుడ్ నుంచి సెలబ్రిటీలు ఎవ్వరూ స్పందించలేదు. తాజాగా హీరో రామ్ ఆసక్తికరమైన ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు. హీరో రామ్.. రాజకీయాలపై చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతూ నెట్‌లో సంచారం చేస్తుంది.
‘‘రాజకీయాలకు వయసుతో సంబంధం లేదు. 20 నుంచి 60 వరకు ఎవరైనా పోటీ చేయవచ్చని పోటీ చేయడం కాకుండా.. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నవారు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది. అనుభవం ఉన్నవారు నాయకులుగా నిలబడితే మరీ మంచిది. ఓటు వేయడం అనేది అందరి బాధ్యత. ఆ ఓటుతోనే నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోండి. దయచేసి ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోవద్దు..’’ అంటూ రామ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కూడా రాజకీయాల గురించి మాట్లాడుకునేలా చేసింది.