మురుగదాస్ - విజయ్ కాంబోలో దివాళి కానుకగా విడుదలైన సర్కార్ టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు కొల్లగొడుతుంది. సినిమా విడుదలై నాలుగు రోజులవుతుంది. అయితే తాజాగా సర్కార్ సినిమా గత రెండు రోజుల నుండి వివాదాల్లో చిక్కుకుంది. సర్కార్ సినిమాలో ప్రభుత్వాన్ని కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసలు పేరు కొమవల్లి పేరుని సర్కార్ సినిమాలో విలనిజాన్ని పండించిన వరలక్ష్మి శరత్ కుమార్ కి పెట్టారని... వరలక్ష్మి కనబడితే చంపుతామంటూ అన్నాడీఎంకే నేతలు థియేటర్స్ పై పడి ప్లెక్సీలు, పోస్టర్స్ ని చింపేస్తూ నానా రభస చేస్తున్నారు. మధురై, కోయంబత్తూరుల్లో దాదాపుగా ఏడు థియేటర్ల వద్ద పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. తమ ఈ ఉద్యమం ఉధృతం చేస్తామని కూడా కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
వరలక్ష్మి పాత్రకి సంబందించిన కొన్ని సన్నివేశాలు జయలలిత ప్రతిష్ఠను దెబ్బతీసేవిగా వున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇక థియేటర్స్ లో కొన్ని చోట్ల సినిమా నిలిచిపోవడమే కాదు... మురుగదాస్ పై పోలీస్ కేసులు కూడా నమోదు కావడంతో.. పోలీసులు మురుగదాస్ ఇంటికి కూడా వెళ్లారు. దానితో మురుగదాస్ అరెస్ట్.... మురుగదాస్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే పోలీసులు మురుగదాస్ ఇంటికి వెళ్లిన మాట వాస్తవమే అని.. కానీ మురుగదాస్ ని అరెస్ట్ చెయ్యడానికి కాదని.... సర్కార్ సినిమా మీద రభస చేస్తున్న ఆందోళన కారులు మురుగదాస్ పై దాడి చేసే అవకాశం ఉన్నందునే ఆయనకు భద్రత కల్పించడానికే పోలీసులు అక్కడికి వెళ్లినట్లుగా తెలుస్తుంది.
అయితే ఇన్ని గొడవల కారణంగా దర్శకుడు మురుగదాస్ కాస్త వెనకడుగు వేసినట్లుగా ప్రచారం మొదలైంది. సర్కార్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించాలనీ.. అంతే కాకుండా కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయాలని మురుగదాస్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వాటిని తొలగించేందుకు ఈ సినిమా టీమ్ రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు.