ఇంతకాలం బిజెపి, వైసీపీలపై కాస్త మెతక ధోరణిని అవలంబిస్తున్న జనసేనాని గత రెండు మూడు రోజులుగా బిజెపిని కూడా బాగా విమర్శిస్తున్నాడు. బిజెపి, వైసీపీలతో తనకేమీ పొత్తు అవసరం లేదని, తానేమీ ఎవ్వరికీ తొత్తుని కాదని తేల్చిచెప్పాడు. రాష్ట్రంలోని పార్టీలకు మోదీని చూస్తే భయమని, నాకు మోదీ సహా ఎవరన్నా భయం లేదని అంటున్నాడు. నేను జేబులో, పిడికిళ్లలో బాంబులు పెట్టుకుని తిరుగుతున్నా.. రాజ్యంగ పదవిలో ఉన్నాడు కాబట్టే ప్రధానిని గౌరవిస్తున్నాను. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా వ్యవహరిస్తే సహించబోనని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అయితే చంద్రబాబు కూడా రాజ్యాంగ పదవిలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా...! మరి ఆయనపై మాత్రం పవన్ ఎందుకు విమర్శలు చేస్తున్నాడు? అనే అనుమానం వస్తోంది.
ఇక విషయానికి వస్తే గత కొంతకాలంగా బిజెపి నేతలు పవన్‌కి కాస్త అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కానీ పవన్ బిజెపిని కూడా టార్గెట్ చేయడంతో తాజాగా నటి, బిజెపి నేతగా మారిన మాధవిలత పవన్‌కి ఓ సలహా అని పోస్ట్ చేసింది. ఇందులో ఆమె జనసేన పార్టీ మీటింగ్స్ అన్నింటిని నేను వింటున్నాను. ఆయన మీటింగ్స్‌లో పవన్ తప్ప మరెవ్వరూ మాట్లాడటం లేదు. ఆయన పక్కన మహిళలు డమ్మీ లుగా ఉంటున్నారు. పవన్‌ని కలవాలంటే పడిగాపులు కాయాలని సీనియర్ జర్నలిస్ట్‌లు, అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎం, పీఎంలను కలవడమే తేలిక. కానీ పవన్‌ని మాత్రం కలవలేకపోతున్నామని అంటున్నారు.
సహజంగా సభలలో మొదట నాయకుని స్పీచ్ ఉండదు. సీఎంని, పీఎంని కలవాలంటే ఏమి చేయాలే క్లియర్‌గా ఉంది. కానీ పవన్‌ని కలవడం మాత్రం ఎలాగో అర్ధం కాదు. ఇది అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్న లోపమని ఆయన గుర్తించాలి. అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో క్లారిటీగా చెప్పడం లేదు. ఎంత సేపటికి ఇతర పార్టీల మీద విమర్శలకే పరిమితం అవుతున్నాడు. ద్వేషాలను రెచ్చగొట్టడం ఒకప్పటి రాజకీయం. మార్పు కోసం వచ్చామని చెప్పే వారు కూడా అదే పాతచింతకాయ పచ్చడిని తినడం నాకు నచ్చలేదు... అని వ్యాఖ్యానించింది.
ఇక పవన్ ద్వేషాలను రెచ్చగొడుతున్నాడని ఆమె అంటోంది. కానీ దేశంలో బిజెపి అనుసరించే ద్వేషాలు రెచ్చగొట్టడం, దానిని ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో నేర్పరి. ఈ విషయం మాధవీలత మర్చిపోయిందేమో? మరి బిజెపి కూడా ఇతర పార్టీలను విమర్శించడం తప్ప చేస్తుందేమిటి? మాధవీలతనే కలవాలంటే రెండు మూడు రోజులు పడుతుంది. మరి పవన్‌కి కలవాలంటే ఆ మాత్రం సమయం పట్టదా? అనేది ప్రశ్న. ముందుగా మాధవీలత గురువింద గింజ సామెతను తెలుసుకుంటే మంచిది.