Advertisement
Google Ads BL

శోభన్‌బాబు అవార్డు అంటే అలా ఉండాలి


ప్రముఖ కథానాయకుడు శోభన్‌బాబు పేరిట ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేయబోతోంది అఖిల భారత శోభన్‌ బాబు సేవాసమితి. డిసెంబర్‌ 23న ఈ అవార్డుల వేడుక జరగనుంది. 2017 సంవత్సరానికిగానూ నటీనటులు, సాంకేతిక నిపుణులకు వివిధ కేటగిరిల్లో ఈ అవార్డులు అందజేయనున్నారు. ఆ వివరాలను వెల్లడించేందుకు హైదరాబాద్‌ దసపల్లా హోటల్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన పరుచూరి బ్రదర్స్ పోస్టర్‌ను, మారుతి అవార్డ్స్ టీజర్‌ను ఆవిష్కరించారు. నిర్మాత ఎమ్‌.నరసింహారావు, శోభన్‌బాబు అభిమానులు సుధాకర్‌ బాబు (మాజీ ఎమ్మెల్యే) జె.రామాంజనేయులు, వీరప్రసాద్‌, జేష్ట రమేశ్‌ బాబు (మాజీ ఎమ్మెల్యే), సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

మారుతి మాట్లాడుతూ ‘‘ఆడియో ఫంక్షన్స్‌కు ఎక్కువ హాజరయ్యే నాకు, ఇలాంటి ఓ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. శోభన్‌బాబు గారికి మా అమ్మ బిగ్‌ ఫ్యాన్‌. అందుకే నేనిక్కడం ఉండటం మా అమ్మకు ఎక్కువ హ్యాపీనీ, కిక్‌ను ఇస్తుంది. ఇవ్వాళ హిట్లు వస్తేనే ఆ హీరోను ఫాలో అవుతూ, హిట్లు లేకుంటే మరో హీరోకు షిఫ్ట్ అవుతున్నారు అభిమానులు. కానీ శోభన్‌బాబు గారు చనిపోయాక కూడా ఆయన్ను ప్రేమిస్తున్నారు వారి అభిమానులు. ఆయన వ్యక్తిత్వాన్ని స్పూర్తిగా తీసుకుని వీరంతా జీవితంలో తాము ఎదిగి, పదిమందికి సాయం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమంలో నన్ను భాగస్తున్ని చేసినందుకు థ్యాంక్స్. ఇందుకు నావంతు కృషి చేస్తానని మనస్పూర్తిగా హామీ ఇస్తున్నాను’’ అన్నారు. 

పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘‘ఎన్.టి.రామారావు గారు ముందుగా పరిచయమైన హీరోగా మా ఫస్ట్ సినిమా శోభన్‌బాబు గారికే రాశాం.  ఆ తర్వాత దాదాపు 13 సినిమాలకు కలసి పనిచేశాం. ఆయన సినిమాలు మానేసే దశలో మా డైరెక్షన్‌లో ‘సర్పయాగం’తో పాటు ‘దోషి-నిర్దోషి’ అనే మరో చిత్రం రాశాం. రెండూ మంచి హిట్టయ్యాయి. అప్పుడు శోభన్‌బాబు గారు ఫోన్ చేసి నేను గౌరవంగా రిటైర్‌ అయ్యేలా రెండు మంచి హిట్లు ఇచ్చారు, ఫ్రీగా ఓ సినిమా చేసుకోమన్నారు. కానీ మేము చేయలేదు. మేం సినిమా చేసినా చేయకున్నా మా మనసుల్లో, అందరి మనసుల్లో చిరస్థాయిగా ఆయన బ్రతికే ఉన్నారు. ఇక తాజా విషయానికొస్తే అవార్డులు ప్రకటించేవాళ్లు కొందరు ఒక సంవత్సరం ఇస్తే మరో సంవత్సరం ఇవ్వడం లేదు. తర్వాతవి కనుమరుగు అవుతున్నాయి. వీళ్లను ఎవరు ఇవ్వమన్నారు, ఎవరు మానేయమన్నారు. అది తప్పు, చేస్తే పద్దతిగా చేయాలి. మనమే కాదు మన తర్వాతి తరం కూడా కొనసాగించేలా ఉండాలి. 29 ఏళ్లుగా పరుచూరి రఘుబాబు ట్రస్ట్ పేరిట ఏడాదికి 10 నుంచి 15 లక్షలు ఖర్చుపెట్టి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందుకు కోటి రూపాయలు ముందే ఫిక్సుడ్‌ డిపాజిట్‌ చేశాం. నాటకాల కోసం కోటిన్నరతో థియేటర్‌ కట్టాం. శోభన్‌బాబు గారి అభిమానులు కూడా అలా అవార్డులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ముందే సమకూర్చుకోవాలనేది నా సలహా. శోభన్‌బాబు గారి పేరున బహుమతి ఇస్తున్నారంటే అది తమకు వస్తే బాగుండునని సినీజనాలు అనుకునేలా ఉండాలి’’ అన్నారు. 

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘‘అవార్డుల ప్రదానం జరగనున్న డిసెంబర్‌ 23కు నాకు ఓ అనుబంధం ఉంది. సినిమాలకు నేను పనికొస్తానని నాలో భీజం వేసింది ఎ.ఎల్‌.కుమార్‌ (రాఘవేంద్రరావు గారి మొదటి చిత్రం ‘బాబు’ నిర్మాత) గారి తండ్రి విశ్వేశ్వరరావు గారు. దాంతో 1975 డిసెంబర్‌ 23న నన్ను కుమార్‌ గారే సినీ పరిశ్రమకు తీసుకొచ్చారు. అయితే నేను 1979లో సినీరచయితనయ్యాను. నాకంటే ముందు 1978లో మా అన్నయ్య రచయిత అయ్యారు. కానీ ఆ 23ను మాత్రం జీవితంలో మర్చిపోలేను. అందుకే ఆరోజునే అవార్డుల వేడుక అనగానే ఆనందమేసింది. ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి మా వంతు కృషి చేస్తాం. ఓ సందర్భంలో నేను మీకు పెద్దన్నయ్యను అన్నారు శోభన్‌బాబు గారు. అంత ప్రేమాభిమానాలు మాపై వర్షింపజేసిన ఆయన కోసం వారి అభిమానులతో కలసి ఎన్ని సంవత్సరాలైయనా పరుచూరి బ్రదర్స్ అడుగేస్తాం. 24 క్రాఫ్ట్ లకు అవార్డులు ఇవ్వడం గురించి కొన్ని నిర్ణయాలు చర్చల దశలో ఉన్నాయి. చర్చించుకుని, ట్రస్టు వివరాలతో సహా నెక్స్ట్ ప్రెస్‌మీట్‌లో తెలియజేస్తాం’’ అన్నారు. 

అఖిల భారత శోభన్‌బాబు సేవాసమితి సభ్యులు వీరప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘2008లో శోభన్‌బాబు సేవాసమితి ప్రారంభించాం. ప్రధాన నగరాల్లో శోభన్‌బాబు గారి కాంస్య విగ్రహాల ఏర్పాటుతో పాటు పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించాం. 2012లో దాసరి నారాయణరావు గారి నేతృత్వంలో శోభన్‌బాబు గారి 75 వసంతాల వేడుకలు నిర్వహించి, 75 మంది పేద సినీ కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించాం. ఇప్పుడు 2018లో ఆయన పేరుతో ప్రతిష్టాత్మక పురస్కారాల వేడుక నిర్వహించబోతున్నాం’’ అన్నారు. 

సుధాకర్‌బాబు మాట్లాడుతూ ‘‘ప్రపంచ చరిత్రలో ఎవరికీ లేనటువంటి అబిమానులు శోభన్‌బాబుకు ఉన్నారు. సంఖ్యలో తక్కువైనా ఆయనకు పేరు తెచ్చేలాగా ప్రయత్నిస్తాం. ఒకప్పుడు ఆయన అభిమానిగానే కర్నూల్ మేయర్‌ అయ్యాను. రాజమండ్రిలో శోభన్‌బాబు గారి విగ్రహావిష్కరణ క్రమంలో ఎమ్మెల్యే టికెట్‌ మిస్‌ చేసుకున్నాను. ఆ తర్వాత అదే రాజమండ్రికి ఎమ్మెల్సీని అయ్యాను. ఇప్పుడు కూడా బైపాస్‌ సర్జరీ జరగడంతో ఇంట్లోవాళ్లు వద్దని వారించినా ఆయనపై అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చాను’’ అన్నారు. 

రామాంజనేయులు మాట్లాడుతూ ‘‘1998లో మద్రాసులో ఆయన ఇంటి పక్కనే బ్యాచిలర్‌గా అద్దెకు ఉండేవాడిని. ఆయన్ను చూస్తే చాలనుకునే నాకు కొద్దిపాటి పరిచయంతోనే ఆయనెంతో క్లోజ్ అయ్యాను. ఈరోజు పారిశ్రామికవేత్తగా నేను ఎదగడం వెనుక ఆయన స్పూర్తి ఎంతో ఉంది. తనకంటే వయసులో ఎంతో చిన్నవారిని సైతం గారు అనే సంభోధించేవారు. తన మనసు నొప్పించిన వ్యక్తిని కూడా ఆదరించే వ్యక్తి శోభన్‌బాబు గారు. అందుకే ఆయనకు ఇంతమంది అభిమానులు. పక్షపాతం లేకుండా ప్రతిభ ఉన్నవారికి ఈ అవార్డులను అందేలా చూస్తాం’’ అన్నారు. 

జేష్ట రమేశ్ బాబు మాట్లాడుతూ ‘‘మరణించాక మరింతమంది అభిమానులను శోభన్‌బాబు గారు సంపాదించుకున్నారు. అభిమానులకే అభిమానులు ఆయన ఫ్యాన్స్. క్రమశిక్షణకు నిర్వచనం ఆయన. అందరూ చదువుకోవాలని కోరుకునే వ్యక్తి. అభిమానంలో పడి చదువుకునే పిల్లలు ఎక్కడ పెడదోవ పడతారోనని ఆందోళన చెందేవారు. పరుచూరి సోదరుల నేతృత్వంలో ఈ అవార్డుల వేడుక అద్భుతంగా జరుగుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.

Sobhan Babu Award Press Meet:

Sobhan Babu Award Announcement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs