తమిళంలోనే కాదు.. దేశంలోనే సినిమా ఇండస్ట్రీకి తమదైన శైలిలో రెండు కళ్లుగా ఉన్నవారు లోకనాయకుడు కమల్‌హాసన్-సూపర్‌స్టార్ రజనీకాంత్. వీరిద్దరు రెండు తరహాలలో తమదైన శైలితో ప్రేక్షకులను మెప్పించారు. ఇక వీరిద్దరు హీరోలుగా రంగప్రవేశం కూడా దాదాపు అటు ఇటుగా ఒకేసారి కె.బాలచందర్ ద్వారానే జరిగింది. తమ కెరీర్ తొలినాళ్లలో వీరు పలు చిత్రాలలో కలిసి నటించారు. కానీ రాను రాను వీరిద్దరూ కలసి ఒకేసారి తెరపైన కనిపించే మహదావకాశం లభించలేదు. ఈ కాలంలో కమల్ కొన్ని చిత్రాలలో ప్రతినాయకుని తరహా పాత్రల్లో కూడా నటించాడు. అయితే ఆయా తరహా చిత్రాలలో ఉదాహరణకు ‘భారతీయుడు’ వంటి చిత్రాలలో ఆయనే హీరో, ఆయనే విలన్ అన్న తరహాలోనే చిత్రాలు వచ్చాయి.
ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘2.ఓ’ నవంబర్ 29న విడుదలకు సిద్దమవుతోంది. ఇండియాలోనే సింగిల్ మూవీ పరంగా అత్యంత ఎక్కువ బడ్జెట్‌తో శంకర్ దర్శకత్వంలో రజనీ హీరోగా, అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తోన్న ఈ 3డి చిత్రం కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని శంకర్ బయటకు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. ప్రతినాయకుడి పాత్ర కోసం మొదట హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్టర్‌ని అనుకున్నాం. వివిధ కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నారు. అనంతరం ఆ పాత్రకోసం కమల్‌హాసన్‌ని కలిశాం. ఆయన నటిస్తే రజనీ, కమల్‌ని కలిసి ఒకే తెరపై చూడాలన్న కల నెరవేరుతుందని ఆశించాం. ఇందుకోసం నేను, పాటల రచయిత జయమోహన్ కలిసి కమల్‌ని కలిశాం. కానీ ఆయన నాతో భారతీయుడు-2 చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపారు. దాంతో మేము అక్షయ్‌కుమార్‌ని పెట్టుకోక తప్పలేదు.. అని చెప్పుకొచ్చాడు.
ఒక విధంగా చూసుకుంటే కమల్, రజనీ ఇద్దరి కెరీర్స్ ఇప్పుడు చరమాంకంలో ఉన్నాయి. వారిద్దరి పొలిటికల్ ఎంట్రీ కూడా దాదాపు ఖాయమే. ఇలాంటి పరిస్థితుల్లో కమల్ ఒప్పుకుని ఉంటే ఎంతో బాగుండేదని ఏ సినీ అభిమాని అయినా అనుకోవడంలో తప్పులేదు.