జనసేనానికి తాజాగా తన మాతృమూర్తి అంజనా దేవి నుంచి ఆశీస్సులు, సూచనలు, తొలి విరాళం లభించాయి. ఆయన తల్లి కొణిదెల అంజనాదేవి తాజాగా పవన్ కార్యాలయానికి వెళ్లి తనవంతు పార్టీ విరాళంగా నాలుగు లక్షల రూపాయల చెక్కును విరాళం అందించింది. ఈ సందర్భంగా ఆమె తనని కలసిన జనసేన ప్రతినిధులతో మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యత, శ్రమతో కూడుకున్నది. అటువంటి కుటుంబాలకు జనసేన అండగానిలవాలి. ఎందుకంటే పోలీసు ఉద్యోగం గురించి నాకు బాగా తెలుసు. మా తాతగారు బ్రిటీష్ హయాంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. నా తండ్రి పశ్చిమగోదావరి జిల్లాలోనే ఎక్సైజ్ శాఖలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఇక ఎక్సైజ్‌శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసిన కొణిదెల వెంకట్రావ్‌తోనే నాకు వివాహం జరిగింది. ఆ శాఖలో ఆయన ఎన్నో పదోన్నతులు పొంది అసిస్టెంట్ సూపరింటెండెంట్ స్థాయిలో పదవీ విరమణ చేశారు.
నా భర్త వెంకట్రావ్ ప్రభుత్వ ఉద్యోగం చేసినందు వల్లే నాకు ఇప్పటికీ పెన్షన్ వస్తోంది. ఆ పెన్షన్ డబ్బును పొదుపు చేయడం వల్లే నేను ఇప్పుడు నాలుగులక్షల రూపాయలను జనసేన పార్టీకి విరాళం ఇవ్వగలిగాను అని చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసును 58 నుంచి 55కి తగ్గించారు. కానీ నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరలా పదవీవిరమణ వయసుని 58ఏళ్లకు పెంచారు. దాని వల్లే నా భర్తకి మరో మూడేళ్లు అదనంగా ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని తెలిపింది.