తెలుగులో ఉన్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో చందు మొండేటికి ప్రత్యేకస్థానం ఉంది. నిఖిల్‌తో 'కార్తికేయ' వంటి థ్రిల్లర్ కాన్సెప్ట్‌ని ఆయన తెరకెక్కించిన విధానం అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు కొల్లగొట్టింది. మొదటి చిత్రంతోనే ఆయనకు ఓ పెద్ద విజయం లభించింది. ఆ తర్వాత ఆయన నాగచైతన్యతో 'చాణక్య' అనే చిత్రం చేయాలని భావించాడు. కానీ చివరకు మలయాళంలో అద్భుత విజయం సాధించిన 'ప్రేమమ్' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి రీమేక్ చేశాడు. ఒరిజినల్ వెర్షన్‌లోని ఫీల్‌ని మిస్ కాకుండా ఈ మూవీని ఆయన తెరకెక్కించిన విధానం కూడా ఎంతో మంది ప్రశంసలను పొందింది. దీని ద్వారా ఆయన ఏ తరహా చిత్రాలైనా చేయగలడనే నమ్మకం ఏర్పడటంతో పాటు నాగచైతన్య ఏరికోరి ఆయన మూడో చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. అదే 'సవ్యసాచి'.
నవంబర్ 2న ఈ మూవీ విడుదల కానుంది. ఎంతో అభిరుచి ఉన్న చిత్రాలను నిర్మిస్తూ, వరుస విజయాలతో దూసుకెళ్తోన్న 'మైత్రి మూవీ మేకర్స్' ఈ మూవీని నిర్మిస్తుండటం, దేశం గర్వించదగ్గ నటుడు, తన ప్రతి చిత్రం వైవిధ్యంగా ఉంటే మాత్రం చేయడనే పేరు తెచ్చుకుని, భాషా సమస్య వల్ల తాను తెలుగులో నటించనని చెప్పిన మాధవన్ ఈ కథను విని వెంటనే ఓకే చేయడం, కీరవాణి సంగీతం అందించడానికి ఒప్పుకోవడం వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. తాజాగా 'సవ్యసాచి' గురించి దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ, దర్శకునిగా నాకు థ్రిల్‌తో కూడిన డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలే నచ్చుతాయి. అవే ప్రేక్షకులకు చెప్పాలని నేను ప్రయత్నిస్తూ ఉంటాను. 'ట్విన్ వానిషింగ్ సిండ్రోమ్'కి సంబంధించిన ఓ ఆర్టికల్‌ని నాకు నా స్నేహితుడు చూపించాడు. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ పాయింట్‌ని నా కథలో మిళితం చేసి చైతు, మైత్రి నిర్మాతలకు వినిపించాను. అందరు బాగా ఎగ్జైట్ అయ్యరు. కొత్తగా ఉంటుందని అనుకున్నాం. అప్పుడే 'సవ్యసాచి' అనే టైటిల్ అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యాం.
హీరోకి తెలియకుండానే ఆయన ఎడమచేయి పనిచేస్తుందనే పాయింట్‌ని ట్రైలర్‌లో చూసి 'హలో బ్రదర్' చిత్రంతో పోలుస్తున్నారేమో..! కానీ అలాంటిదేమీ లేదు. వీలున్న చోట మాత్రమే ఆ పాయింట్ చూపించాం. ఈ ఒక్క పాయింట్ చుట్టూనే కథ తిరగదు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్స్, ఫైట్స్, మంచి లవ్‌స్టోరీ వంటివి సమపాళ్లలో ఉంటాయి.. అని చెప్పుకొచ్చాడు.