తనుశ్రీదత్తా, రాఖీ సావంత్‌ల వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. నిజానికి కొందరు మీటు విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం నవ్వు పుట్టించేలా ఉన్నాయి. దీనిని ముందుగా 10ఏళ్ల కిందట మొదలు పెట్టింది నేనే అని.. కానీ నాడు ఎవ్వరూ స్పందించలేదని తనుశ్రీ అంటుంటే.. కాదు..కాదు ఈ ఉద్యమానికి ముందు తెరలేపింది తానే అని అమలాపాల్, శ్రీరెడ్డి వంటి వారు క్రెడిట్ కోసం పడుతున్నతాపత్రయం చూస్తే ఈ ఉద్యమం అసలు ఉద్దేశ్యం కనుమరుగై, హాలీవుడ్ కంటే ముందు నేనే అంటే.. కాదు నేనే అంటున్న వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది.
ఇక తాజాగా తనుశ్రీదత్తాకి మగబుద్దులే అని, తాను లెస్బియన్ అని రాఖీసావంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించింది తనుశ్రీ. ఆమె మాట్లాడుతూ, నేను స్వలింగ సంపర్కురాలిని కాదు.. అలాగే డ్రగ్స్ ఎడిక్ట్‌ని కాదు. అసత్య ప్రచారాలు ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వవు. నేను కనీసం పొగ, మద్యం కూడా తాగను. పితృస్వామ్య భావజాలం, స్త్రీ ద్వేషంతో నిండిపోయిన మురికి వ్యవస్థను భరిస్తున్న ఓ మహిళను. సమాజంలోని ఆలోచనాధోరణిని మార్చగల శక్తి ఉన్న ఈ ఉద్యమాన్ని చౌకబారు వ్యాఖ్యలతో హాస్యాస్పదం చేయకండి.. అని చెప్పుకొచ్చింది.
మరోవైపు తనుశ్రీదత్తాతో పాటు రాఖీసావంత్‌లు కూడా ఒకరిపై ఒకరు పరువు నష్టం దావాలు వేసుకోవడానికి, న్యాయస్థానాలను ఆశ్రయించడానికి కూడా సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో మరో అవార్డు విన్నింగ్ దర్శకునిపై తాజాగా మీటు ఆరోపణలు వచ్చాయి. ‘లాహోర్’ చిత్రం ద్వారా ఉత్తమ తొలి చిత్ర దర్శకునిగా జాతీయ అవార్డును అందుకున్న సంజయ్ పురాన్ సింగ్ చౌహాన్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ సినిమా ఆడిషన్స్ విషయంలో సంజయ్ తనని బట్టలు ఊడదీసి నగ్నంగా నిలబడమని వేధించాడని మోడల్ రైనా వశిష్ట ఆరోపించింది.
అయితే సంజయ్ ఈ వ్యాఖ్యలను ఖండించాడు. ‘నా ద్వారా అవకాశం రానందువల్లే ఆమె తనపై కక్ష్యకట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తోంది’ అని తెలిపాడు. దీనిని బట్టి ఈ ఉద్యమంలో కూడా రెండు పరస్పర విరుద్ద కోణాలు ఉన్నాయని అర్ధమవుతోంది.