తెలుగు దర్శకుల్లో కె.విశ్వనాథ్ తర్వాత ఆయన శిష్యుడైన పెద్దవంశీకి టేకింగ్ పరంగా, తనదైన శైలి ఉంది. ఆయన చిత్రాలన్నీ ఎంతో హృద్యంగా, పొట్టచెక్కలయ్యేటువంటి మంచి హాస్యంతో కలిసి ఉంటాయి. సంగీతం విషయంలో ఈయన టేస్ట్ మరింత గొప్పగా ఉంటుంది. ఇళయరాజా ఈయనకు ఏకంగా ఒకేసారి 100కి పైగా ట్యూన్స్ ఇచ్చి , అవసరమైనప్పుడు వాటిల్లో ఏదైనా వాడుకోమని ఇచ్చాడంటే ఇళయరాజాకి ఆయనంటే ఎంత ఇష్టమో అర్ధం అవుతుంది. నాడు ఇళయరాజా ఇచ్చిన ట్యూన్స్‌లో కొన్నింటిని వంశీ.. కె.విశ్వనాథ్ వంటి వారికి కూడా ఇచ్చాడు. ఇక ఈయనను మహామేధావిగా చెప్పాలి. అయితే కొంతకాలం ఆయన ఇండస్ట్రీకి ఎంతో దూరంగా తన సొంత ఊరికి వెళ్లిపోయాడు. మానసికంగా కూడా ఈయన చాలా ఇబ్బందులు పడ్డాడని అంటారు.
ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయన 25 కూడా చిత్రాలు తీయలేదంటే ఆయన ఒక్కో చిత్రానికి ఎంత సమయం వెచ్చిస్తాడో అర్ధమవుతుంది. గోదావరి యాస, కోనసీమ, గోదావరి అందాలు, అద్భుతమైన పాటల చిత్రీకరణ వంటివి ఆయనలోని గొప్పతనాలు. ఇక ఇళయరాజా తర్వాత ఈయన ఎక్కువగా స్వర్గీయ చక్రితో పనిచేశాడు. ఎంతో సున్నితమైన, ఎమోషన్స్‌ని ఏమాత్రం దాచుకోకుండా ముక్కుసూటిగా ఉండటం ఆయన నైజం. ‘మంచు పల్లకి, లేడీస్‌టైలర్, సితార, అన్వేషణ, ఏప్రిల్ ఒకటి విడుదల, ఔను.. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’ వంటి ఎన్నో ఆణిముత్యాలను ఆయన అందించాడు.
ఇక ఈయనకి చాలా ఇష్టమైన నటి భానుప్రియ. నాడు వీరిద్దరు ప్రేమించి పెళ్లిచేసుకోనున్నారని, కానీ భానుప్రియ తల్లి, వంశీ భార్య దానికి అడ్డుపడటంతో ఆయన మానసికంగా కృంగిపోయాడని అంటారు. ఇక విషయానికి వస్తే తాజాగా వంశీ ‘ఆలాపన’ చిత్రం షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటనను వివరించాడు.
అప్పట్లో ‘ఆలాపన’ క్లైమాక్స్‌గా భానుప్రియ మీద డ్యాన్స్‌ని అరుకు కొండపై చిత్రీకరించాం. డ్యాన్స్‌లో భాగంగా భానుప్రియ గాలిలోకి ఎగిరి మోకాళ్లపై కిందకు దూకే భంగిమ ఉంటుంది. అందువల్ల వైజాగ్ నుంచి మోకాళ్లకు రక్షణగా క్యాప్స్ తీసుకుని రమ్మని ఒక వ్యక్తిని పంపించాం. ఆ వ్యక్తి చాలా ఆలస్యమైనా రాలేదు. లైటింగ్ పోతోంది. నాకు కోపం వచ్చి అరిచేస్తున్నాను. మోకాళ్ల క్యాప్స్ వచ్చాయి.. వాటిని వేసుకున్నానని భానుప్రియ నాతో చెప్పి ఆమె ఆ షాట్‌ని చేసేసింది. ఆ తర్వాత ఆమె మోకాళ్లకు దెబ్బలై రక్తం తీవ్రంగా రావడం చూసి షాకయ్యాను. టైమ్ వేస్ట్ చేయకూడదని భావించి ఆమె క్యాప్స్ వచ్చాయని అబద్దం చెప్పి అలా చేసింది.. అని వంశీ చెప్పుకొచ్చాడు.