మెగాస్టార్ చిరంజీవి తనయునిగా సినీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత రామ్‌చరణ్ తన సొంత టాలెంట్‌ని చూపిస్తూ హిట్స్ ఇస్తున్నాడు. ఇక ఒకానొక సమయంలో ఆయన ధరణి దర్శకత్వంలో ‘మెరుపు’ చిత్రం చేయాలని భావించాడు. కానీ చివరకు ఏమైందో ఏమోగానీ ధరణి ‘మెరుపు’ను పక్కనపెట్టి సంపత్‌నందికి ఆ రోజుల్లో ఛాన్స్ ఇవ్వడం ఎందరినో ఆశ్చర్యపరిచింది. అదే ‘రచ్చ’ చిత్రం. ఈ చిత్రం పెద్ద బ్లాక్‌బస్టర్ కాకపోయినా కమర్షియల్‌గా మాత్రం బాగానే వర్కౌట్ అయింది. అయితే ఈ చిత్ర విజయంలో కొత్తవాడైన సంపత్‌నందికి పరుచూరి బ్రదర్స్ వర్క్ చేయడం బాగా కలిసివచ్చింది. ‘రచ్చ’ చిత్రానికి పరుచూరి బ్రదర్స్‌ని ఏరికోరి చిరు ఎంచుకున్నాడు.
ఈ విషయం గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘సంపత్‌నంది ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చేశాడు. మొదట సంపత్‌నంది ఈ కథను చిరంజీవిగారికి చెబితే ఆయన సంపత్‌కి కొన్ని మార్పులు చేర్పులు చెప్పాడు. అయితే ఈ కథపై పరుచూరి బ్రదర్స్ కూర్చుంటే బాగుంటుందని, డైలాగులు కూడా పరుచూరి బ్రదర్స్ చేతనే రాయిద్దామని చిరంజీవి నిర్మాతలతో అన్నారట. డైలాగ్స్ నేను రాసుకోగలనండీ.. వీటికి పరుచూరి బ్రదర్స్ అవసరమా? అని సంపత్‌నంది నిర్మాతలతో అనడంతో నిర్మాతలు ఆయన మాటలను కాదనలేక ఒప్పుకున్నారు. మార్పులు చేర్పులు చేసుకుని మరలా స్క్రిప్ట్‌ని చిరంజీవి గారి వద్దకు వెళ్లి సంపత్ చూపించాడు. ఆ స్క్రిప్ట్ వినగానే దీనిలో పరుచూరి బ్రదర్స్ కూర్చోలేదా? అని చిరంజీవి సంపత్‌ని ప్రశ్నించాడు. దాంతో సంపత్ తానే రాసుకుంటానని చెప్పిన విషయాన్ని నిర్మాతలు చిరుకి చెప్పారు.
అప్పుడు చిరంజీవిగారు ‘‘చూడు సంపత్.. నువ్వే చేసుకోవాలంటే మరో కథ చెప్పు. ఇది ‘ఘరానా మొగుడు’ తరహాలో ఉన్న కథ. ‘ఘరానా మొగుడు’కి పరుచూరి బ్రదర్స్ రాశారు కాబట్టి దీనికి కూడా అనుభజ్ఞులైన వారే రాయాలి. ఈ కథను పరుచూరి బ్రదర్స్ కావాల్సిందేనని తేల్చిచెప్పారు. అప్పుడు ఆ కథ మావద్దకు వచ్చింది’’ అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.