ఈ ఏడాది అందరికి గుర్తుండిపోయే చిత్రాలలో మొదటి స్థానం ‘రంగస్థలం’కి దక్కుతుంది. విభిన్న చిత్రాలను తెరకెక్కించే దర్శకునిగా పేరున్న సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు, ఇంతకాలం మరుగునపడిపోయిన రామ్‌చరణ్, సమంతల సత్తాకి ఈ చిత్రం నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి.. రామ్‌చరణ్ నటించిన చిత్రాలతో ఇప్పటివరకు సంతృప్తికి లోనయ్యాడో లేదో తెలియదు గానీ ఇందులో చరణ్ నటన మాత్రం తండ్రిని మించిన తనయుడు అనే గుర్తింపును, ప్రశంసలను దక్కించుకుంది. చరణ్ నటనావిశ్వరూపం చూసి ఇంతకాలానికి సరైన చిత్రం ఆయనకు పడిందని ప్రశంసలు హోరెత్తాయి. వచ్చే సినిమా అవార్డులలో ఈ మూవీకి అగ్రస్థానం లభించడం ఖాయమని అర్ధమవుతోంది.
హీరోని చెవిటి వానిగా, హీరోయిన్‌ని పల్లెటూరి పడుచుగా చూపిస్తూనే కమర్షియల్ ప్రేక్షకుల నుంచి వైవిధ్యభరితమైన చిత్రాలను ఆదరించే అందరికీ ఇది షడ్రసోపేతమైన చిత్రంగానే చెప్పుకోవాలి. ఇక కథ, కథనాలు, అనసూయ, జగపతిబాబు వంటి వారి నటన, దేవిశ్రీప్రసాద్ సంగీతం వంటివి దీనిని మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఏకంగా 200కోట్ల గ్రాస్‌ని వసూలు చేసిన ఇది 120కోట్ల షేర్‌ని సాధించి ‘నాన్‌బాహుబలి’ రికార్డులను తిరగరాసింది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టను పెంచడమే కాదు.. కాసుల వర్షం కురిపించింది. కాగా ఈ చిత్రం కిందటి వారం బుల్లితెరపై కూడా ప్రసారమైంది. దీనికి కూడా అద్భుతమైన ఆదరణ లభించడం విశేషం. ఏకంగా ఈ చిత్రం 19.5 టీఆర్పీ రేటింగ్స్‌ని సాధించింది. గతంలో ‘మగధీర’తోపాటు రామ్‌చరణ్ చిత్రం ఏదీ ఈ స్థాయి టీఆర్పీలను సాధించలేకపోయింది. ఇక ‘సరైనోడు, అజ్ఞాతవాసి’ వంటి చిత్రాలే బుల్లితెరపై, యూట్యూబ్‌లలో సంచలనాలు సృష్టిస్తున్న ఈ నేపధ్యంలో ‘రంగస్థలం’ చిత్రం డిజిటల్ మీడియాతోపాటు హిందీలోకి డబ్బింగ్ చేస్తే, కేవలం హిందీలోనే కాదు.. ఏభాషలోనైనా ఇదే స్థాయి ఆదరణను రాబట్టడం ఖాయమనే చెప్పాలి.
మొత్తానికి ‘రంగస్థలం’ థియేటర్లలో సందడి ముగిసినా, ఇతర మాధ్యమాలలో మాత్రం ఇంకా దూసుకుని పోతూనే ఉంది. బుల్లితెరపై దీనికి మొదటిసారే కాదు.. ఎన్నిసార్లు ప్రసారం చేసినా ‘మగధీర, అత్తారింటికి దారేది, అతడు’ చిత్రాల తరహాలో బాగా టీఆర్పీలు వస్తాయని యాజమాన్యం ఆశతో ఉంది.