బుల్లితెర మీదనే కాదు.. వెండితెరపై కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న నటి రష్మిగౌతమ్. కాగా ఇటీవల ఆమె బరువు సమస్యపై ఓ అభిమాని ప్రశ్నించినప్పుడు తాను రోగనిరోధకశక్తి తక్కువగా ఉండే వ్యాధితో బాధపడుతున్నానని, కాబట్టి బరువు పెరగడం, తగ్గడం వంటివి దాని వల్లే అని చెప్పింది. చిన్నతనంలో తాను పలు తీవ్రమైన ఆరోగ్యసమస్యలతో ఎంతో బాధపడ్డానని చెప్పి షాకింగ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె మరోసారి తన ఆరోగ్యం గురించిన సంచలన విషయాలను బయటపెట్టింది.
ఆమె మాట్లాడుతూ.. ఆటో ఇమ్యూన్ సమస్య వల్ల నేను చిన్నతనంలో స్టెరాయిడ్స్ కూడా వాడానని చెప్పింది. శిరీష అనే నెటిజన్ రేష్మికి ట్వీట్ చేస్తూ, రూమటాయిడ్ సమస్యకు చికిత్స ఉందో లేదో నాకు తెలియదు. నా భర్త నాలుగేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం ఎక్కడికి వెళ్లాలో అర్ధం కావడం లేదు. మీరు కూడా అదే వ్యాధితో బాధపడుతున్న వారే కదా...! నాకేమైనా సూచనలు ఇవ్వగలరా? అని రష్మిని కోరింది. దానికి రష్మి సమాధానం ఇస్తూ, ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ లేదు. మన జీవనశైలిలో మార్పులు తెచ్చుకోవడం ద్వారా మాత్రమే ఫలితం కనిపిస్తుంది. ఆయుర్వేద మందులు వాడి చూడండి. ఇటీవల నేను ఆటో ఇమ్యూన్ సమస్యల వల్ల స్టెరాయిడ్స్ తీసుకున్నాను. 12ఏళ్ల వయసులో ఈ వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు తీవ్రంగా నొప్పి ఉండే ఇంజక్షన్లు తీసుకున్నాను. ఆ తర్వాత మా అమ్మ చెప్పిన కొన్ని చిట్కాలు, జీవనశైలిలో మార్పుల ద్వారా కాస్త బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. నొప్పితో బాధపడటం అనేది జీవనంలో మామూలే. అలాగని నొప్పులకే పరిమితం అయిపోకుండా, రోజూ వ్యాయామం, నడక వంటివి చేస్తూ ఉండాలి. తాజా ఆహారాన్ని తీసుకోవాలి.
అంతేకాదు...మనకి ఒత్తిడి కలిగించి... వెనక్కి నెట్టాలని ప్రయత్నించే మనుషులను దూరంగా పెట్టాలి అని చెప్పుకొచ్చింది. రష్మి ట్వీట్‌ని చూసిన గిరిధర్ అనే నెటిజన్.. ఈ విషయం గురించి మరలా మరలా అడిగి అందరు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు ధృఢంగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని కోరాడు. దానికి రష్మి స్పందిస్తూ, ఫర్వాలేదండి. ఈ విషయం గురించి పది మందికి తెలిస్తేనే దీనిపై ప్రజలకు అవగాహన కలుగుతుంది. ఈ సమస్య రోజురోజుకి ఎక్కువ అవుతోంది. ఆరోగ్యభీమా తీసుకున్నా కూడా ఈ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చులు సరిపోవు. సాధారణంగా మంచి వయసులో ఉన్న వారే ఎముకుల నొప్పి వంటివి వస్తే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ప్రజలు అయ్యో.. అప్పుడే వయసు అయిపోయిందా? అని వెక్కిరించినా పట్టించుకోవద్దు. కొత్త వైద్యుడి కన్నా పాత రోగి నయం.. అని గొప్పగా సమాధానం ఇచ్చింది.
దీనికి మరో నెటిజన్.. డాక్టర్ల కంటే రష్మిగౌతమే మంచి వైద్యురాలు అని ట్వీట్ చేశాడు. దానికి వెంటనే రష్మి స్పందిస్తూ, చూశారా? ఇలాంటి నెగటివ్ ఆలోచనల నుంచే మీరు దూరంగా ఉండాలి. దానికి అతను.. అయ్యో మేడమ్. మీరు నన్ను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. నేను మిమ్మల్ని పొగిడాను, బాధపెట్టి ఉంటే క్షమించండని కోరాడు. దానికి రష్మి మీ క్షమాపణను నేను స్వీకరిస్తున్నా. కానీ దయచేసి ఎవరిని పడితే వారిని వైద్యులను చేయకండి అంటూ సమాధానం ఇచ్చింది. ఇంత వ్యవహారంలో రష్మి ఎంతో హుందాగా మాట్లాడిందని చెప్పాలి.