‘అరుంధతి’ చిత్రం ప్రారంభంలో ఓ యువకుడు, తన భార్యతో కలిసి పాడుపడిన బంగ్లాలోకి వెళ్తాడు. అక్కడ పశుపతి చేతిలో బలవుతాడు. ఈ సీన్ అంత త్వరగా మర్చిపోగలిగేది కాదు. అందులో నటించిన యువకుడే అరవింద్. ఆ చిత్రం నుంచి అందరు ఆయనను ‘అరుంధతి’ అరవింద్ అంటారు. ఆయన తాజాగా మాట్లాడుతూ, ‘అరుంధతి’ చిత్రంలో మొదట నన్ను పశుపతి పాత్రకు తీసుకున్నారు. ఆ తర్వాత నా స్థానంలో సోనూసూద్‌కి అవకాశం ఇచ్చారు. అయ్యో.. మంచి పాత్ర మిస్ అయిందే అని బాధపడ్డాను. కానీ ఏడుస్తూ కూర్చోలేదు. అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సందర్భంగా దర్శకుడు కోడిరామకృష్ణ గారిని కలిశాను. పశుపతి పాత్రకు నా కంటే సోనూసూదే కరెక్ట్ అని చెప్పాను.
మరుసటి రోజు కోడిరామకృష్ణ గారు పిలిచి నాకు ఆ యువకుడి వేషం ఇచ్చారు. ఆ పాత్ర నాకు బాగా గుర్తింపును తెచ్చింది. ఇక పవన్‌గారి ‘అన్నవరం’ చిత్రంలో నాకు విలన్ పాత్ర లభించింది. దర్శకుడు భీమనేని శ్రీనివాస్ నన్ను పవన్ గారి దగ్గరకు తీసుకుని వెళ్లి పరిచయం చేశాడు. అప్పుడు ఆయన నాతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. ఆ సినిమా షూటింగ్ సందర్భంలోనే మరో ఆసక్తికర సంఘటన జరిగింది. మా నాన్న విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేసేవారు. నెలకి రెండు రోజులు ఆయనకు వెహికల్స్‌ని చెక్ చేసే పని ఉండేది.
ఓరోజు రాత్రి ఆయన లింగంపల్లి వద్ద వెహికల్స్‌ని చెక్ చేస్తున్నారు. ‘అన్నవరం’ షూటింగ్‌కి వస్తూ ఉన్న పవన్ వాహనాన్ని ఆయన ఆపి, వెంటనే పంపివేసినట్లు నాకు మా నాన్న ఫోన్ చేసి చెప్పారు. అరవింద్ మా అబ్బాయే అని పవన్‌కి చెప్పినట్లుగా కూడా నాకు చెప్పాడు. పవన్ సెట్స్‌కి వచ్చే లోపు ఆయనేం అంటారేమోనని నాకు టెన్షన్ మొదలైంది. ‘అరవింద్‌గారు.. మీ నాన్నగారు నా వెహికల్‌ని ఆపేశారు...’ అని సరదాగా వ్యాఖ్యానించే సరికి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని, టెన్షన్ నుంచి బయటపడ్డాను.. అని చెప్పుకొచ్చాడు.