వర్మ ఏ పని చేసినా అందులో ఆయన తనదైన శైలిని చూపిస్తాడు. చిత్ర జయాపజయాలను పక్కన పెడితే ప్రతి విషయంలోనూ ఆసక్తిని, సంచనాలను సృష్టిస్తూ సినిమాకి కావాల్సిన ప్రమోషన్‌ని, తన చిత్రం గురించే అందరు మాట్లాడుకునేలా చేయడంలో ఆయన సిద్దహస్తుడు. ఈ విషయంలో ఈయనకు నోబుల్ బహుమతి కూడా సరిపోదనే చెప్పాలి. ఇక తాజాగా ఆయన బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో తానే నిర్మాతగా, హీరోగా నటిస్తున్న తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌కి పోటీగా ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనే అంశాన్ని తీసుకుని వివాదాస్పద అంశాలను కెలకడానికి రెడీ అయ్యాడు. ఈ విషయం ఆయన ఎప్పుడో చెప్పినా కూడా ఆ తర్వాత కామ్ అయిపోవడంతో ఆయన బాలయ్య, చంద్రబాబులకి భయపడి సినిమా పక్కన పెట్టాడని అందరు భావించారు. కానీ వర్మ తాను భయపెట్టే వ్యక్తినే గానీ ఎవ్వరికీ భయపడే వ్యక్తిని కాదని, అంతా నా ఇష్టం అని నిరూపిస్తూ తాజాగా ఈ చిత్రం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
కాగా ఇటీవల చంద్రబాబు పాత్రకి ఓ హోటల్ సర్వర్‌ని వెతికి పట్టుకున్న ఆయన ఎన్టీఆర్ పాత్రకి కూడా సరైన పాత్రధారిని చూపిస్తే 10లక్షల బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఇక లక్ష్మీపార్వతిగా ఎవరు నటించనున్నారనే విషయంలో మాత్రం సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తున్నాడు. కాగా ఈ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విషయంలో ఆయన మరో అప్‌డేట్‌తో వచ్చాడు. ఓవైపు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్‌కి కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఆయన సోదరుడైన మంచి టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్‌ని తన చిత్రం కోసం ఆయన ఎంచుకోవడం విశేషం.
ఇక కళ్యాణి మాలిక్ విషయానికి వస్తే ఈయనను శ్రీకళ్యాణి రమణ అని కూడా పిలుస్తారు. కీరవాణి సోదరుడిగా, రాజమౌళి, శ్రీలేఖలకు కజిన్‌గా, వరసకు విజయేంద్రప్రసాద్ అంకుల్ అయ్యే ఈయన మొదట తన అన్నయ్య కీరవాణి వద్ద కోరస్ సింగర్‌గా చేరాడు. ప్లేబ్యాక్‌సింగర్‌గా, పలు కమర్షియల్ యాడ్స్‌కి సంగీతం అందించిన ఈయన చంద్రశేఖర్ యేలేటి మొదటి చిత్రం, తెలుగులో చిన్న బడ్జెట్ చిత్రాలలో సంచలన విజయం సాధించిన 'ఐతే' చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించాడు. 'మనసు మాట వినదు, ఆంధ్రుడు, బాస్-ఐ లవ్‌యు, వారిద్దరు వయసు పదహారే, అమృతవర్షం, అష్టాచెమ్మా, అలా మొదలైంది, గోల్కోండ హైస్కూల్, బాలయ్య అధినాయకుడు, అంతకు ముందు ఆ తర్వాత, ఊహలు గుసగుసలాడే, బందిపోటు, హోరాహోరి, కళ్యాణవైభోగమే, జ్యోఅచ్చుతానంద, అమ్మమ్మగారి ఇల్లు' చిత్రాల ద్వారా తనలోని అభిరుచి ఉన్న సంగీత దర్శకుడిని నిరూపించుకున్నాడు.
కానీ ఆయనకు టాలెంట్‌కి తగ్గ అవకాశాలు, గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఇక తాజాగా వర్మ ఆయనకు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం సంగీత బాధ్యతలను అప్పగించాడు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, కీరవాణి గారు ఎన్టీఆర్ బయోపిక్‌కి పనిచేస్తున్నారు. అలాంటి సమయంలో ఆయన సోదరుడు కళ్యాణి మాలిక్ నా చిత్రానికి పనిచేయడం కాకతాళీయమే. అంతేగానీ ఉద్దేశ్యం పూర్వకంగా ఆయనను తీసుకోలేదు అని తెలుపుతూ, కళ్యాణి మాలిక్‌తో తాను దిగిన ఫొటోని ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.