మహేష్‌బాబు ఇప్పటి వరకు పూరీజగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, శ్రీకాంత్ అడ్డాల వంటి ఎందరితోనో రెండే చిత్రాలు చేశాడు. ఇక ప్రస్తుతం ఆయన తన ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రంగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు-అశ్వనీదత్‌ల భాగస్వామ్యంలో 'మహర్షి' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ మనదేశంతో పాటు యూఎస్‌లో కూడా జరుగుతోంది. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం నవంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సమయంలో మహేష్ తన 26వ చిత్రం ఎవరితో ముందుగా చేస్తాడనే ఆసక్తి మొదలైంది. తనకు '1' (నేనొక్కడినే) వంటి డిజాస్టర్‌ని ఇచ్చిన సుకుమార్‌తోనే మహేష్ తదుపరి చిత్రం ఉంటుందిట. '1' (నేనొక్కడినే) చిత్రం పలువురి ప్రశంసలు అందుకున్నా కూడా సగటు ప్రేక్షకులను, సగటు మహేష్ అభిమానులను నిర్మాతలైన 24 ఫ్రేమ్స్ అధినేతలకు నిరాశను మిగిల్చింది.
సుకుమార్, రామ్‌చరణ్‌తో తీసిన 'రంగస్థలం' ద్వారా తనలోని మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ అందరినీ మెప్పించాడు. అసలే సుకుమార్‌పై ఉన్న నమ్మకంతో పాటు 'రంగస్థలం' ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో మహేష్, సుక్కుకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. దీనిని మైత్రి మూవీస్ బేనర్‌లో గానీ, లేదా '1' (నేనొక్కడినే) నిర్మించిన 24 ఫ్రేమ్స్ పతాకంపై గానీ చేయనున్నాడని భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చారిత్రక నేపధ్యం ఉన్న చిత్రాల పట్ల మన స్టార్స్ ఆసక్తిని చూపుతున్న తరుణంలో తెలంగాణ సాయుధపోరాటం, రజాకర్ల నేపధ్యంలో సాగే ఓ కథను సుక్కు మహేష్‌కి చెప్పాడని సమాచారం. అయితే మహేష్ ఇలాంటి చిత్రం చేస్తే ముస్లింల మనోభావాలు దెబ్బతీసి, కొందరు నొచ్చుకునే ప్రమాదం ఉందని, కాబట్టి మరో సబ్జెక్ట్‌ని చెప్పమని సుక్కుని కోరాడట. ప్రస్తుతం సుక్కు రెండు వైవిధ్యమైన కథలను తయారు చేశాడని, వాటిల్లో ఏదో ఒకటి మహేష్ ఓకే చేస్తాడని టాలీవుడ్ సమాచారం.
గతంలో సూపర్‌స్టార్ కృష్ణ సైతం 'ఛత్రపతి శివాజీ' చారిత్రక చిత్రం చేయాలని భావించి మరీ అందులో ముస్లింలను చెడుగా చూపించడానికి ఇష్టపడక పక్కన పెట్టాడు. మరి అదే దారిలో మహేష్ కూడా నడుస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈ చిత్రం తర్వాత మహేష్ 'అతడు, ఖలేజా' తర్వాత త్రివిక్రమ్‌తో మూడో చిత్రం, 'అర్జున్‌రెడ్డి' ఫేం సందీప్‌రెడ్డి వంగాలతో పనిచేస్తాడని తెలుస్తోంది.