నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా... అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ఈ రోజు ఆదివారం రాత్రి శిల్ప కళావేదికలో త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కి సూపర్ డూపర్ విజయం సాధించిన అరవింద సమేత - వీర రాఘవ విజయోత్సవ సభ కన్నుల పండుగగా అభిమానుల ఆనందోత్సాహాల నడుమ అదరగొట్టింది. అయితే అరవింద సమేత హిట్ ఒక ఎత్తు అయితే... ఇప్పుడు బాలకృష్ణ... ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సక్సెస్ మీట్ వేదికపైకి రావడం మరో ఎత్తు అన్నట్టుగా ఉంది నందమూరి అభిమానుల వాలకం. ఎందుకంటే బాలకృష్ణ, ఎన్టీఆర్ ని గత కొంతకాలం అంటే గత ఎనిమిదేళ్లుగా దూరంగా ఉంచుతున్నాడు. అన్న హరికృష్ణ మరణంతో మళ్ళీ ఎన్టీఆర్ కి దగ్గరగా వచ్చిన బాలకృష్ణ అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ కే వస్తాడనుకుంటే ఎన్టీఆర్ బయోపిక్ తో కుదరక ఇప్పుడు అరవింద సక్సెస్ మీట్ కి వచ్చాడు.
ఇక నందమూరి అభిమానుల ఎనిమిదేళ్ల కల నెరవేరింది. బాలయ్య బాబు, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల కలయికని అరవింద స్టేజ్ మీద చూసిన అభిమానుల కడుపు నిండిపోవడమే కాదు... ఆ వేడుకలో పాల్గొన్న జగపతి బాబు చెప్పినట్టు నందమూరి అభిమానులు దసరా- దీపావళి పండగలను ఒకేసారి చేసేసుకున్నట్లుగా ఉంది అభిమానుల ఆనందం చూస్తుంటే. మరి బాలకృష్ణ, ఎన్టీఆర్ అరవింద సమేత చూడలేదని. ఎన్టీఆర్ బయోపిక్ షూట్ తో బిజీగా ఉన్నానని చెప్పి... అన్నగారు హరికృష్ణ మరణానికి నివాళులర్పించి.. ఎన్టీఆర్ ని అరవింద సమేత టీంని పేరు పేరున పొగిడేశాడు. తన తండ్రిగారు ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు అన్న హరికృష్ణ చైతన్య రధం నడిపారని.. ఆయన లేని లోటు తీరనిదని చెబితే.. ఎన్టీఆర్ మాత్రం తన తండ్రి చనిపోయి దూరమవలేదని.. అయన ఇక్కడే ఎక్కడో తిష్ట వేసుకుని ఉన్నారని.. తన తండ్రి తర్వాత తండ్రిలా తన బాబాయ్ బాలకృష్ణ తమ వెన్నంటే ఉన్నారని చెప్పినట్లుగానే బాలయ్య అరవింద టీంకి శుభాకాంక్షలు చెప్పాడు.
నాన్న లేని లోటుని తీర్చడానికి మా బాబాయ్ ఇక్కడికి వచ్చారు అని కళ్యాణ్ రామ్ కూడా చెప్పాడు. ఇక బాలకృష్ణ కాస్త పొడి పొడిగా మాట్లాడినప్పటికీ.. కొడుకులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తో కలిసి ఒకే ఫ్రెమ్ లో ఫోటో దిగి అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిచ్చాడు. బాలకృష్ణ - కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు అభిమానులు ఒకే ఒక పూల దండతో అలంకరించడం కూడా అభిమానులను ఆనందపరిచింది. మరి నందమూరి అభిమానులు ఒక్కతాటిపై ఉంటే ఎలా ఉంటుందో ఇలాంటి ఈవెంట్స్ పదే పదే జరిగితేనే జనాలకు అర్ధమయ్యేది. ఇక ఎన్టీఆర్ కి మాత్రం అరవింద సమేత విజయం ఎంత సంతోషాన్నిచ్చిందో తెలియదు కానీ... బాలయ్య రాకతో మాత్రం బాగా సంతోషపడ్డాడన్నది మాత్రం స్టేజ్ మీద ఎన్టీఆర్ ముఖంలోని నవ్వుని చూసి తెలుసుకోవచ్చు.