రాంగోపాల్‌వర్మ వంటివారు ఎన్టీఆర్ జీవితంలోని పలు చీకటి కోణాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా కూడా బాలకృష్ణ నటిస్తూ, మొదటిసారిగా నిర్మాణంలో కూడా భాగస్వామిగా ఉండి, తనతో 100వ ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమిపుత్రశాతకర్ణి’ని అద్భుతంగా తీర్చిదిద్దిన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్‌కి మాత్రం దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఇక ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. ఎన్టీఆర్ సినీ ప్రయాణంపై మొదటి భాగం, రాజకీయప్రస్థానంపై మరోభాగం రానున్నాయి.
ఇప్పటికే ఈ చిత్రంలోని ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్న బాలకృష్ణ, శ్రీదేవి పాత్రలో రకుల్‌ప్రీత్‌సింగ్, ఏయన్నార్ పాత్రలో సుమంత్ వంటివారి లుక్స్ బయటకు వచ్చాయి. ఇక తాజాగా ఇందులో ఎన్టీఆర్ శ్రీమతి బసవతారకం పాత్రను పోషిస్తోన్న విద్యాబాలన్ సింపుల్ లుక్ బయటకు వచ్చింది. దసరా కానుకగా ఈ చిత్రం యూనిట్ మరో స్టన్నింగ్ స్టిల్‌ని విడుదల చేసింది. అది కూడా ఎన్టీఆర్‌తో హరికృష్ణ ఉన్నప్పటి స్టిల్ కావడం విశేషం.
ఇందులో ఎన్టీఆర్‌పాత్రను పోషిస్తోన్న బాలకృష్ణ, నందమూరి హరికృష్ణలా నటిస్తోన్న కళ్యాణ్‌రామ్‌లు లుక్ అదిరిపోయేలా ఉంది. పోస్టర్‌లో ఎన్టీఆర్ పాత్రను పోషిస్తోన్న బాలయ్య అచ్చమైన తెలుగు పంచెకట్టులో, తెలుపురంగు చొక్కా, ధోవతి, కండువా ధరించి కుర్చీలో కూర్చుని ఉన్నాడు. హరికృష్ణలా నటిస్తోన్న కళ్యాణ్‌రామ్ తన తండ్రి మాదిరే డ్రస్ వేసుకుని, కర్లింగ్ హెయిర్‌తో కనిపిస్తూ తన తండ్రికి ఏదో ముందుకు వంగి విశేషాలు చెబుతూ, వినయంగా, వినమ్రతతో కనిపిస్తున్నాడు.
ఇక అబ్బాయ్ కళ్యాణ్‌రామ్.. బాబాయ్ బాలకృష్ణతో కలిసి నటించడం ఇది రెండోసారి. ఎన్నోఏళ్ల కిందట బాలకృష్ణ,సుహాసిని జంటగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్ బాలనటునిగా నటించి, తెరంగేట్రం చేశాడు. మరి ఇన్నేళ్ల తర్వాత ఆయన మరోసారి తన బాబాయ్‌తో కలిసి నటిస్తూ ఉండటం విశేషమనే చెప్పాలి. కాగా ఈ చిత్రం సాయికొర్రపాటికి చెందిన వారాహిచలన చిత్రం బేనర్‌తో పాటు విబ్రిమీడియా, బాలయ్యకి సంబంధించిన ‘ఎన్‌బికే’ ఫిల్మ్స్ పతాకంపై రూపొందుతోంది.