కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన పయనం మొదలు పెట్టి ఆ తర్వాత బ్లాక్‌బస్టర్ నిర్మాతగా మారిన నటుడు బండ్లగణేష్. తనకు ‘అధ్యక్షా’ అని పిలిచే అవకాశం రావడమే తన కోరిక అని గతంలోనే వెల్లడించాడు. పవన్‌ని దేవుడిగా చెప్పుకునే ఆయన ఉన్నట్లుండి జనసేనలోనో, లేక తనకు గురువు, అన్ని అయిన బొత్ససత్యనారాయణ ఉన్న వైసీపీలోనో చేరకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరి అందరికీ షాకిచ్చాడు. స్వయాన రాహుల్‌గాంధీ చేతుల మీదుగా కండువా కప్పుకున్న తనకు రాహుల్ హామీ ఇచ్చాడని, కాంగ్రెస్ తరపున షాద్‌నగర్ లేదా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి గెలుస్తానన్నాడు. కానీ తాజాగా షాద్ నగర్ సీటు మరోకరు తన్నుకు పోయారు.
ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాధారణంగా ప్రజాప్రతినిధులు, ఉదాహరణకు భరత్ అనే నేనులో మహేష్ ప్రమాణం చేసినట్లు బండ్ల గణేష్ అను నేను అంటూ మాట్లాడటం ప్రారంభించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తనకు, రోజాకి మధ్య జరిగిన వాదోపవాదాలపై స్పందిచాడు. ఓ సారి లైవ్‌డిబేట్‌లో వైసీపీఎమ్మెల్యే, మాజీ హీరోయిన్ రోజా.. బండ్లను ఉద్దేశించి ‘పళ్లు రాలగొడతా.. బ్రోకర్‌వి నువ్వు’ అని వ్యాఖ్యానించింది. అదే చర్చలో బండ్లగణేష్ కూడా నీపళ్లు రాలగొడతా అని ధూషించాడు.
ఆ సంఘటనపై బండ్ల వివరణ ఇస్తూ, మన సోదరి ఏదో నోరు జారింది. నేనేంటో ఆమెకి తెలుసు. ఆ రోజున నేను కూడా నోరు జారాను. ఆ తర్వాత నాకు బాధ అనిపించింది. గబుక్కున అంత పెద్ద పదం వాడేనే అని ఫీలయ్యాను. ఈరోజుకి ఆమె నాకు సోదరి వంటిదే. ఆ క్షణాన ఆవేశంలో అనుకున్నామే గానీ నేను మాత్రం వాటిని పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు.. అని చెప్పుకొచ్చాడు.
‘మీటు’ ఉద్యమం సందర్భంగా సినీ తారలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి విలేకరి ఆయన్ను ప్రశ్నించగా, చాలా తెలివిగా తప్పించుకున్నాడు. ‘మీ ఇంటర్వ్యూకు నేను రాజకీయ నాయకుడిగా వచ్చానే గానీ,.. సినీ ప్రముఖునిగా రాలేదు.. కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వను..’ అని చెప్పాడు.