ఏ హీరోకైనా అభిమానులే కొండంత బలం. వారు ఒకసారి అభిమానించడం మొదలుపెడితే జయాపజయాలకు అతీతంగా స్పందిస్తూ ఉంటారు. అందుకే అభిమానులే మాకు అండ అని, ప్రేక్షకులే దేవుళ్లు అని మన నటీనటులు చెబుతూ ఉంటారు. ఇక ప్రతి హీరోకి తనకు అభిమానులలో ఉన్న క్రేజ్, ఇమేజ్ చూపించాలనే కోరిక ఉంటుంది. అందుకే కొందరు హీరోలు తమ పుట్టినరోజు, సినిమాల విడుదల సందర్భంగా తామే ఆర్దికంగా సాయం అందిస్తూ, అభిమానుల చేత కేక్ కట్టింగ్‌లు, బ్యానర్లు, కటౌట్లు, పాలాభిషేకాలు చేయిస్తుంటారు. కానీ ఇప్పుడిప్పుడే మన హీరోల మనసు మారుతోంది. సినీ అభిమానులను రక్తదానం, నేత్రదానం వంటి వాటివైపు ప్రోత్సహించి, తన అభిమానుల చేత కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను విస్తృతం చేసిన వారిలో మెగాస్టార్ ఒకరు. అయితే మెగాస్టార్ కూడా తన బర్త్‌డే వేడుకలను ఘనంగానే జరిగేలా చూస్తాడు. కానీ పవనకళ్యాణ్, వెంకటేష్, నాగార్జున వంటి వారు మాత్రం పెద్దగా హంగామా చేయరు. అభిమానులపై చేయి చేసుకునే స్టార్స్ ఉన్న రోజుల్లో కొందరు హీరోలు మాత్రం పలువురి ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా ఎన్టీఆర్ కూడా అభిమానం ఉండవచ్చని, కానీ వీరాభిమానం తగదని చెప్పాడు. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ సినీ వేడుకలో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. కేవలం బాధితుల కుటుంబాలకు ఆర్దికసాయం చేసినంత మాత్రాన ప్రాణాలు తిరిగిరావు. ఇక బేనర్లు, కటౌట్స్ కట్టేటప్పుడు, టిక్కెట్ల కోసం తొక్కిసలాటలో కూడా పలువురు కరెంట్ షాక్‌లు, ఇతర దుర్ఘటన వల్ల మృత్యువాత పడుతున్నారు. ఇక విషయానికి వస్తే మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ బర్త్‌డే ఈ నెల 15వ తేదీన. ఈయన తన అభిమానులకు, మెగాభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఓ సందేశం ఇచ్చాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే అత్యంత ప్రియమైన మెగాభిమానులకు అంతులేని ప్రేమతో.. గెలిచినప్పుడు వేలకుపైగా చేతులు చప్పట్లు కొడతాయి. ఓడిపోయినా మీ చప్పట్ల చప్పుడు తగ్గకుండా, జయాపజయాలకు అతీతంగా నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఇలా వెన్నంటి ఉన్న అభిమానులందరికీ కృతజ్ఞతలు.
ఈ మధ్య కాలంలో మీ అంచనాలను అందుకోలేకపోయాను అనేది నిజం. దానికి గల కారణాలను నేను విశ్లేషించుకుంటున్నాను. మీ సలహాలు, సూచనలను తీసుకుని నా తప్పులను సరిదిద్దుకుంటాను. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నాను. మీరు నాపై చూపించే ఈ అభిమానమే నన్ను మానసికంగా దృఢంగా ఉంచి, మంచి చిత్రాలు చేయడానికి ఉత్సాహాన్ని అందిస్తోంది. మీకు నానుంచి చిన్న విన్నపం. నా పుట్టినరోజు సందర్భంగా పలు చోట్ల అభిమానులు కేక్ కట్టింగ్, బ్యానర్స్ వంటివి కట్టాలని ఉందని చెబుతున్నారు. వాటికి పెట్టే ఖర్చులతో ఎవరైనా పేద విద్యార్ధుల చదువు కోసం ఉపయోగించండి. ఇలా చేస్తే నేను ఇంకా ఆనందిస్తాను. ఎల్లప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే మీ సాయిధరమ్‌తేజ్'అంటూ సుదీర్ఘ సందేశం ఇచ్చారు. వెల్‌డన్ సాయి...!