ఎవరు ఏమి చెప్పినా యద్దార్ధ కల్పిత గాధలను తీయడంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్టైలే వేరు. 'రక్తచరిత్ర'లో ఎన్టీఆర్ పాత్రను శత్రుఘ్నుసిన్హా చేత చేయించడం, 'కిల్లింగ్ వీరప్పన్'లో అచ్చు వీరప్పన్‌ని పోలిన నటుని ఎంపికలో, రక్తచరిత్ర, వంగవీటి, సర్కార్‌తో పాటు పలు చిత్రాలలో ఆయన దావూద్ ఇబ్రహీం నుంచి పరిటాల రవి, సునీత వరకు అవే ఛాయలుండే నటీనటులను ఎంచుకోవడంలో తన ప్రతిభ చూపించాడు. సినిమా జయాజపజయాలు పక్కనపెడితే ఆయన ఎంచుకునే నటీనటుల తీరు ప్రత్యేకంగా ఉంటుంది. ఇక 'ఆఫీసర్' డిజాస్టర్ తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న వర్మ తన మౌనం మరో తుఫాన్ ముందు ప్రశాంతత అని నిరూపించాడు. తనలోని వివాదాస్పద వ్యక్తి మారలేదని మరోసారి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' గురించి చెప్పి సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతున్నాడు.
ఇక విషయానికి వస్తే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో చంద్రబాబుని దాదాపు విలన్‌గా వర్మ చూపించడం ఖాయమని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన అచ్చు చంద్రబాబునాయుడుని పోలి ఉన్న ఓ హోటల్‌లోని సర్వర్ ఫోటోని పోస్ట్ చేశాడు. ఇందులో ఆ సర్వర్ నిక్కర్, బనియన్, గడ్డం నుంచి అచ్చు ఆయనలానే ఉన్నాడు. ఈ వ్యక్తి ఎక్కడ ఉంటాడో చెప్పిన వారికి తాను లక్షరూపాయల బహుమానం ఇస్తానని కూడా ప్రకటించాడు. నిజానికి చంద్రబాబు బయోపిక్‌గా రూపొందుతున్న 'చంద్రోదయం' చిత్రంలోని చంద్రబాబు పాత్రను పోషిస్తున్న నటుని కంటే ఈయన 100కి 100శాతం పర్‌ఫెక్ట్‌గా ఉన్నాడనే చెప్పాలి. ఈ నేపధ్యంలో ఓ ప్రముఖ చానెల్‌కి చెందిన జర్నలిస్ట్ రోహిత్ అతని వివరాలను వర్మకి అందించాడట. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన వర్మ రోహిత్‌కి కృతజ్ఞతలు తెలపడంతో పాటు సినిమా ప్రారంభంలో అతని పేరు టైటిల్స్‌లో వేస్తామని, వెంటనే తన బ్యాంక్ ఖాతాను తెలియజేస్తే తాను ప్రకటించిన ప్రైజ్‌మనీ అకౌంట్‌లో వేస్తానని తెలిపాడు.
ఇక ఈ చంద్రబాబుని పోలిన వ్యక్తిని చూస్తుంటే గతంలో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు ఎన్నికల్లో పోటీ పడేటప్పుడు అచ్చు వైఎస్‌ని పోలిన ఓ వ్యక్తి, చంద్రబాబులా ఉన్న మరో వ్యక్తిల ఫొటోలు, వీడియోలు, ఇంటర్వ్యూలు కూడా వచ్చాయి. బహుశా ఇతను అతనే అయి ఉంటాడని అంటున్నారు. ఈ విషయం తెలియడానికి కొంత కాలం వెయిట్ చేయకతప్పదు.