లోకనాయకుడు అనగానే అద్భుతమైన నటుడు కమల్‌హాసన్ కళ్ల ముందు మెదులుతాడు. ఈయనది కూడా ప్లేబోయ్ టైప్ వ్యవహారమే. తన కెరీర్‌లో తనకంటే వయసులో పెద్ద అయిన శ్రీవిద్య, శ్రీదేవి, వాణిగణపతి, సారికా, గౌతమి వంటి ఎందరితోనో ఈయనకు పెళ్లిళ్లు, సహజీవనం, ఎఫైర్లు ఉన్నాయి. ఇక అవి బలవంతంగా జరిగాయా? లేక ఎదుటి వారి ఇష్టపూర్వకంగా జరిగాయా? అనేది మాత్రం వేయిడాలర్ల ప్రశ్నే. ఇక తాజాగా కమల్‌హాసన్ 'మీటూ' ఉద్యమంపై స్పందించాడు. విషయానికి వస్తే తమిళ రచయిత వైరముత్తు లైంగికంగా పలువురిని వేధించాడని గాయని చిన్మయి శ్రీపాద తెలిపిన సంగతి తెలిసిందే. అంతేకాదు..తన స్నేహితురాలి పట్ల కూడా వైరముత్తు అసభ్యకరంగా ప్రవర్తించాడని చిన్మయి శ్రీపాద తెలిపింది. దీంతో కోలీవుడ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇది చినికి చినికి గాలి వానలా, తుపాన్‌గా మారుతోంది.
ఈ సందర్భంగా చిన్మయి శ్రీపాద వైరముత్తు చేతిలో లైంగిక వేధింపులకు, అసభ్యకర ప్రవర్తనకు బలైన వారి పేర్లు, వారి సందేశాలను తానే స్వయంగా తెలుపుతూ వస్తోంది. ఈ విషయంపై లోకనాయకుడు స్పందిస్తూ, ఇలాంటి విషయాలను బాధితులే ముందుకు వచ్చి మాట్లాడాలి. దానికి భయపడాల్సిన అవసరం లేదు. సంబంధం లేని మూడో వ్యక్తి దానిపై కామెంట్ చేయకూడదు. నిజాయితీగా కొనసాగితే మాత్రం నేను 'మీటూ' ఉద్యమాన్ని స్వాగతిస్తాను. సమాజంలో మహిళలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వేధింపులను 'కణ్ణగి'(దక్షిణ భారత కావ్యమైన 'శిలప్పాదికారం'లోని ముఖ్యపాత్ర) రోజుల నుంచి వీటిని చూస్తున్నాం.. వింటున్నాం.... అని చెప్పుకొచ్చాడు.
ఈ విషయంలో కమల్ చెప్పింది మాత్రం వాస్తవమే. ఇంత జరిగిన తర్వాత తమకు జరిగిన వేధింపులు, తమ కెరీర్‌ని నాశనం చేసిన వారి పేర్లను ఇప్పటికీ బయటపెట్టకుండా, అదేమంటే మాకు భయం అనే వారి మాటలు నమ్మడం కాస్త కష్టం. ఈ విషయంలో తనుశ్రీ దత్తాని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే బాధితులు అసలైన దోషులను బయటపెట్టకపోతే భవిష్యత్తు తరాలు కూడా అలాంటి వారి వల్ల నాశనం అయిపోతాయి. కాబట్టి అందరిపై అనుమానం వచ్చేలా కాకుండా అసలు ఎవరో వారి పేర్లు బయటపెట్టే పని చేయాలి అని కొందరు అభిప్రాయపడుతుంటే ఉమనైజర్ అయిన కమల్ నీతులు మాట్లాడటం ఏమిటని? మరికొందరు విమర్శిస్తున్నారు.