సినీ, రాజకీయ రంగాలలో బాలకృష్ణనే తన వారసుడని ప్రకటించిన నాడు స్వర్గీయ ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు. బాలయ్య కూడా తండ్రికి తగ్గ తనయునిగా నిరూపించుకుంటూ నటసింహంగా నందమూరి అభిమానులందరి అభిమానాన్ని సంపాదించాడు. తండ్రిని మించిన తనయుడు, తండ్రికి తగ్గ వారసుడుగా మాత్రం బాలయ్యను చెప్పలేం. ఎందుకంటే ఏ హీరో అభిమాని అయినా సరే ఎన్టీఆర్‌ని బేధాలు లేకుండా అభిమానించి, దేవుడిలా కొలిచేవారు. ఇక ఎన్టీఆర్ వాక్పటిమ ముందు బాలయ్య సరిపోడని అందరికీ తెలిసిందే. అయినా ఎన్టీఆర్ తనయులందరిలో బాలయ్య బాబే సూపర్. ఇక ఈయన రాజకీయాలలోకి కూడా ప్రవేశించిన హిందుపురం ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇక విషయానికి వస్తే ప్రతిష్టాత్మకమైన తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలయ్య స్వయంగా నటిస్తూ, నిర్మాణంలో కూడా తొలిసారి భాగస్వామిగా ఉన్నాడు. ఇక బాలయ్య తీసే బయోపిక్‌లో వివాదాస్పద అంశాలే ఉండవని తెలుస్తోంది. ఎన్టీఆర్ జీవితం లక్ష్మీపార్వతి ప్రవేశానికి ముందు అందరికీ తెరచని పుస్తకమే. కాబట్టి ఆయన కెరీర్‌ని రెండో వివాహం ముందు వరకు ఎంతో ఫ్లాట్‌గా కొనసాగింది. ఇక బాలయ్య టిడిపి ఎమ్మెల్యే కావడం, సీఎం చంద్రబాబు బాలయ్యకి ఎంతో కావాల్సిన వ్యక్తే కాదు.. స్వయాన వియ్యంకుడు కూడా. కాబట్టి చంద్రబాబుని గొప్పగా చూపిస్తాడే గానీ లక్ష్మీపార్వతి విషయం, ఎన్టీఆర్ పదవీచ్యుతుడు కావడం, ఎన్టీఆర్‌ని ఎదిరించి, ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న విషయాలు బాలయ్యాస్ బయోప్‌క్‌లో ఉండే అవకాశం లేదు.
కానీ నాడే రాంగోపాల్‌వర్మతో పాటు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగంధం పేరిట చిత్రాలు తీస్తామని ప్రకటించారు. మరో వైపు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ దర్శకత్వంలో శరవేగంగా రూపొందునప్పటికీ, రాంగోపాల్ వర్మ, కేతిరెడ్డి మాత్రం సైలెంట్ అయిపోయారు. కానీ తాజాగా వర్మ మరలా తెరపైకి వచ్చాడు. తాను దసరా నుంచి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం షూటింగ్‌ని ప్రారంభిస్తానని ప్రకటించాడు. అదే తడువుగా ఈనెల 19న ఈ చిత్రం విశేషాలను తిరుపతిలో వెల్లడిస్తానన్నాడు. ఈ చిత్రం నిర్మాణం కోసం గతంలో ముందుకు వచ్చిన వైయస్సార్ సీపీ నేత సైలెంట్ కావడంతో, వర్మ తాజాగా కొత్త నిర్మాతలను వెతుక్కున్నాడు. ఈ చిత్రం కోసం ముంబైకి చెందిన పారిశ్రామిక వేత్త బాలగిరికి చెందిన జీవీ ఫిల్మ్స్ బేనర్‌లో రాకేష్‌రెడ్డి నిర్మాణంలో దీనిని తీయనున్నాడు.
వేగంగా చిత్రాలు తీయడంలో వర్మ స్పెషలిస్ట్. సో.. కేవలం దసరాకి ప్రారంభించి, జనవరి నెలాఖరులకల్లా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తానని ప్రకటించాడు. వాస్తవానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినంత వరకు చిత్రం ఉంటే ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తికలగదు. కానీ లక్ష్మీపార్వతి రాకతో ఆయన జీవితంలో పెను మార్పులు సంభవించాయి. దానినే వర్మ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. వివాహానంతర జీవితంపైనే వర్మ ఫోకస్ పెట్టాడు. ఇక ఇప్పటి నుంచే వర్మ చిత్రం సంచలనాలకు కేంద్రబిందువు అవ్వడం ఖాయం. అందునా దాదాపు ఒకే సమయంలో ఈ రెండు చిత్రాలు విడుదలైతే మాత్రం రెండింటి మధ్య పోలిక రావడం ఖాయమనే చెప్పాలి.