టాలీవుడ్‌లో ఏ చిత్రం విడుదలై బాగుంటే మాత్రం చిన్నాపెద్దా తేడా లేకుండా జక్కన్న రాజమౌళి ప్రశంసలు కురిపిస్తాడు. తన పోటీదారులైన దర్శకులు, సమకాలీకులను కూడా సినిమా బాగుంటే ప్రశంసించడంలో జక్కన్న వెనుకాడడు. ఒక విధంగా తెలుగు సినీ ప్రేక్షకులు రాజమౌళి ప్రశంసించే చిత్రాలలో ఏదో ఉంది కాబట్టే పొగడ్తలు గుప్పిస్తాడు తప్ప ఏదో మొహమాటానికి చెప్పడు అనేది వాస్తవం. కాబట్టే ప్రతి ఒక్కరు ఆయన బాగుందని చెప్పిన చిత్రాలను చూసేందుకు సిద్దమవుతారు. మరో విధంగా రాజమౌళి ప్రశంసలు ఎంతటి స్టార్ దర్శకుడు-స్టార్ హీరోల చిత్రాలకు అయినా ప్రమోషన్స్‌లో అదనపు బలం అవుతాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'అరవిందసమేత వీరరాఘవ' చిత్రం మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ గురించి ఎవ్వరూ నెగటివ్‌గా మాట్లాడకపోవడం మాత్రమే కాదు.. ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సామాన్య ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుంచి రివ్యూలు, మీడియా సినిమా అద్భుతమని అంటున్నారు. ఇక నందమూరి అభిమానుల ఆనందానికైతే హద్దే లేదు. ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్‌లోనే 'జనతాగ్యారేజ్'ని మించి వసూళ్లు సాధించి, ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది.
మొదటి రోజే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 30కోట్లకు పైగా వసూలు చేసి 'నాన్‌బాహుబలి' రికార్డును సొంతం చేసుకుంది. ఇక మొదటి వారం.. అందునా దసరా సెలవులు కావడంతో భారీ కలెక్షన్లు ఖాయమని, రెండునెలలుగా సరైనా హిట్ లేకుండా ఎందరో ఎదురుచూస్తున్న బాక్సాఫీస్ సందడిని, బ్లాక్‌బస్టర్ లోటుని తీర్చడం ఖాయమని అర్ధమవుతోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనను చూసి, ఆయన నటనలో కనిపించిన పరిణతిని చూసి అందరు ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్ర విజయంలో ముగ్గురు ప్రధాన సూత్రధారులు కనిపిస్తున్నారు. వారే రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్, జగపతిబాబు. ఇక త్రివిక్రమ్ చెప్పినట్లు యుద్దం చూపించడం కాదు.. ఆ యుద్దం వల్ల కలిగే పర్యవసాలను చూపించిన విధానంతో త్రివిక్రమ్ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. మహాభారత యుద్దం, అశోకుడి యుద్దం తర్వాత జరిగిన సంఘటనలను ప్రేరణగా తీసుకుని త్రివిక్రమ్ చూపిన ప్రతిభ అనన్యసామాన్యం. భారీ యాక్షన్ సీన్స్, అనవసర డ్యూయెట్లు, కథకి అడ్డు వచ్చే కామెడీని కూడా వదిలి ఎంతో నిజాయితీగా మాటల మాంత్రికుడు చేసిన ప్రయత్నం చిన్నదేమీ కాదు.
ఇక తాజాగా 'అరవింద సమేత వీరరాఘవ'పై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. ఆయన మాట్లాడుతూ, 'ఒక యుద్దం తర్వాత జరిగే సంఘటలతో కూడిన ఫ్లాట్ సబ్జెక్ట్‌ని ఎంచుకోవడం నిజంగా త్రివిక్రమ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం. అది చాలా బాగా వర్కౌట్ అయింది. తారక్ నటన అద్భుతం. అందరికీ గుర్తుండిపోయే నటనను ప్రదర్శించాడు. జగపతిబాబు గారి నటన కూడా అద్భుతంగా ఉంది. ఈ సందర్భంగా 'అరవింద సమేత' యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని ట్వీట్ చేశాడు.