'మీ టూ' ఉద్యమం ఊపందుకుంది. ఎందరో నటీమణులు సినిమాలలో వేషాల కోసం ఎన్ని దెబ్బలు, లైంగిక వేధింపులు, మానసిక, శారీరక హింసల గురించి చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులో మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు ఎలాంటి వారైతే మనకేమీ, టాలెంట్ ఉంటే నటిస్తామని సన్నాయి నొక్కులు నొక్కే వారి కంటే తానెంత ఉన్నతుడో నిరూపించాడు. దీనికి తాజాగా ఓ ఉదాహరణ ఆయన గొప్పతనానికి అద్దం పడుతుంది. బాలీవుడ్ దర్శకుల్లో సుభాష్ కపూర్‌కి మంచి పేరుంది. మంచి చిత్రాలను తీస్తాడనే కితాబును అందరు ఇస్తారు.
కానీ ఆయన నిజజీవితంలో చాలా నీచుడని గీతిక త్యాగి వీడియోలతో సహా నిరూపించింది. ఈ నేపధ్యంలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత గుస్షన్‌కుమార్ బయోపిక్‌గా సుభాష్ కపూర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మొఘల్' చిత్రం నుంచి బయటకి వచ్చేశాడు. ఈ సినిమా అమీర్, ఆయన భార్య కిరణ్‌రావులే నిర్మిస్తుండటంతో వారు బయటకు వచ్చేశారు. ఈ విషయంపై అమీర్ స్పందిస్తూ, ఈ ఘటన వెలుగులోకి రాగానే మేమే విచారణ జరిపాం. కానీ ఈ ఘటనకు సంబంధించిన విషయం కోర్టులో ఉన్నట్లు తెలిసింది.
ఈ విషయంలో తప్పెవ్వరిదో నాకు తెలియదు. మహిళలకు సురక్షిత, సంతోషకరమైన పని వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉంది. మీటూ ఉద్యమం ద్వారా సినీ పరిశ్రమ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మేలుకుని లైంగిక వేధింపులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. మహిళలకు సురక్షిత, సంతోషకరమైన వాతావరణం కల్పించేందుకు నేను సిద్దమని వాగ్దానం చేస్తున్నానని చెప్పాడు.