నేటి సమాజంలో కోపం వస్తే అరిచే కాలం పోయింది. వాగ్వివాదానికి, తమ అభిప్రాయాలు, ఆలోచనలను వివరించే పరిస్థితి లేదు. చిన్న గొడవ కూడా చినికి చినికి గాలి వానలాగా మారి, చిన్న విషయాలకే సహనం కోల్పోయి ఎదుటి వ్యక్తిని హత్య చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదాహరణకు ప్రేమ వివాహాలు చేసుకున్నారని, కుల మతాంతర పెళ్లిళ్లు, ప్రేమల వల్ల ఆయా యువత తల్లిదండ్రులు కేవలం హత్య చేయడమే తమ పరువు అనుకుంటున్నారు. కానీ అమ్మాయి, లేదా అబ్బాయి పిల్లలు కులాంతర వివాహాలు చేసుకుంటే వారి తల్లిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోతూ హత్యలే శరణం అని భావిస్తున్నారు. కానీ తమ పిల్లలు తమకి ఇష్టం లేని వారిని వివాహం చేసుకోవడం కంటే హత్య చేయించడం అనేది మరింత పరువు తక్కువ పనే అని చెప్పాలి. పిల్లలు పెద్దలై ఫలానాది చేస్తాను అంటే బుజ్జగించి, పరిస్థితులు వివరించి, కౌన్సిలింగ్ వంటివి ఇప్పించాలి.. లేదా పిల్లల మనోభావాలకు వారిని వదిలేయాలి తప్ప చంపడం మాత్రం పరిష్కారం కాదు.
ఇక విషయానికి వస్తే అగ్ర రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, భార్యాభర్తలు ఒకరిని ఒకరు చంపుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 'నాతి చరామి' అనే ప్రమాణంతో వివాహం జరిగి ఇద్దరు ఒకటవుతారు. స్త్రీ, పురుషుల వివాహం ద్వారా ఓ కొత్త కుటుంబం ఏర్పడుతుంది. వావి వరసలతో కూడిన నాగరికత, సంస్కృతి మనకి సొంతం. అలాంటి సమాజం, సంస్కృతుల నుంచి వచ్చిన భార్యాభర్తలు ఒకరిని ఒకరు చంపుకోవడం దారుణం. ఇవన్నీ చూస్తుంటే.. వింటుంంటే మనం, మన సమాజం ఎటు వెళ్తున్నాయా? అని భయమేస్తోంది.
ఈ సమయంలో నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. చంపేసి తప్పించుకోవచ్చు అనే ఆలోచన నుంచి బయటకు రండి..! వాటిని మీ మనసులోంచి తీసి వేయండి.. నేరం చేసిన వారు నేడైనా, రేపైనా పట్టుబడతారు. నేరం చేయాలనే ఆలోచననే రానివ్వకండి..! ఇష్టం లేదు అనుకుంటే దేవుడే ఆదేశించాడని భావించి వదిలేసి, హాయిగా మీరనుకున్న విధంగా మీరు జీవించండి..! ప్రశాంతంగా జీవితం గడపండి.. హత్యలు చేయడం మానవత్వం కాదని, అది దేనికీ పరిష్కారం కాదని తెలుసుకోండి అని చెప్పుకొచ్చాడు.