మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తాజా ఇంటర్వ్యూలో సినిమా రంగానికి చెందిన పలు అంశాల గురించి చెప్పుకొచ్చాడు. ఫ్యాక్షన్ సమస్యను పరిష్కరిస్తున్నాం అనగానే హీరో ఏదో మంచి మాటలు బోధిస్తాడని అనుకోవద్దు. ‘అరవింద సమేత’లో హీరో ఏమి బోధించడు. ఈ జనరేషన్‌కి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటారు. జీవితంలోని అన్ని సంఘటనలను పూర్తి చేసేది కేవలం సంభాషణలు మాత్రమే. ఇద్దరు మనుషులు కొట్టుకునేది, ప్రేమించుకునేది కేవలం మాటల వల్లనే. అలానే ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు చూపించాం. మన సినిమాలలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇంటర్నేషనల్ సినిమాలలో మజిల్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ల సినిమా 90 నిమిషాలలో పూర్తయిపోతుంది. మన సినిమా అప్పటికి ఇంటర్వెల్ అవుతుంది. వాళ్ల కంటే మనం ఏమి తక్కువ? వారి కెమెరాలు ఏమి బంధిస్తాయి.?వాళ్ల లైటింగ్‌లో కాంతి కొత్తగా ఎందుకు ఉంటుంది? ఈ విధానాలను ఎవరో ఒకరు బద్దలు కొట్టాలని చూస్తూ ఉంటాం. కానీ మనం చేయకుండా ఎవరో చేయాలని అనుకుంటూ ఉంటాం.
నేను కూడా దానికి మినహాయింపు ఏమీ కాదు. పక్కవాడికి వర్కౌట్ అయితే మనం చేద్దాంలే అని భావిస్తూ ఉంటాం. ప్రతి 10,15ఏళ్లకు ఒకసారి ఇండస్ట్రీ మారుతూ ఉంటుంది. ‘లవకుశ’ చిత్రాన్ని కలర్‌లో తీసినా పూర్తిస్థాయి కలర్ చిత్రాలు రెగ్యులర్‌గా రావడానికి 12 ఏళ్లు పట్టింది. అప్పటికే హిందీ, తమిళంలో కూడా కలర్ చిత్రాలు వస్తున్నా.. మనకి మాత్రం అంత సమయం తీసుకుంది. ఇప్పుడు ప్రేక్షకులు ఇంట్లో కూర్చుని టీవీలో ‘జబర్దస్త్, కపిల్‌శర్మ, బ్రహ్మానందం’ల షోలు చూస్తున్నారు. అనవసరమైన కామెడీలను పెడితే, సినిమా మధ్యలో ఈ కామెడీ ఏంటి? కథ చెప్పరా బాబూ...! అని ప్రేక్షకులు అంటారు.
ఈ మద్య కొత్త దర్శకులను చూస్తుంటే ఆనందంగానూ, ఈర్ష్యగానూ ఉంటోంది. ‘అర్జున్‌రెడ్డి, రంగస్థలం, కేరాఫ్ కంచరపాలెం, పెళ్లిచూపులు, గూఢచారి, ఆర్‌ఎక్స్100’ వంటివి..! ఇక దర్శకులకు బడ్జెట్ మీద అవగాహన ఉండాలి. ఇక ఈ సినిమాకి మొదట అనిరుధ్‌ని అనుకున్నాం. కానీ ఆ తర్వాత నీకుతెలుగు అర్ధం కావడానికి, నాకు నువ్వు అర్ధం కావడానికి మరికొంతసమయం పడుతుందని చెప్పేశాను. ఈ సినిమాలో థమన్ నాకు చాలా సర్‌ప్రైజ్‌లు ఇచ్చాడు.
సాధారణంగా నీ సంగీతంలో హిందీ ఎక్కువగా వినిపిస్తుంది. అలాగే నాకు నెంబర్ ఐటమ్స్‌వద్దు అని రెండు మూడు సూచనలు చేశాను. దేవిశ్రీతో పనిచేయకపోవడానికి కారణం నన్ను నేను వెత్తుక్కోవడమే. పవన్ రాజకీయాలలోకి వెళ్లారు దానిని నేనుకూడా మీలాగే పేపర్లలో చూసి తెలుసుకున్నాను. ఇక ఆయనకు ప్రసంగాలు నేనే రాస్తున్నానని అనుకుంటున్నారు. నాకు స్క్రిప్ట్ రాయడానికే బద్దకం. ఇక అదెక్కడ రాస్తాను..? నేను అందరితో నిజాయితీగా ఉంటాను. అందుకే అందరికీ దగ్గర అవుతుంటానేమో..! నేను ఎవరితో అయితే పనిచేస్తున్నానో.. వారంతా నాకంటే తెలివైన వాళ్లు. ఎన్టీఆర్ ప్రతి షాట్‌ని చాలా త్వరగా పూర్తిచేస్తాడని అంటారు. ఆ ట్రిక్ నాకు తెలిసిపోయింది. స్క్రిప్ట్స్ చాలా సార్లు వింటాడు. బాగా విని మైండ్‌లోకి ఎక్కించుకుంటాడు...’’ అని చెప్పుకొచ్చాడు..!