‘సినిమా అనేది ప్రయాణం. ఏ సినిమాకైనా ప్రయాణమే ముఖ్యం. ఫలితం కేవలం బోనస్’ వంటిది అని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ‘అరవిందసమేత వీరరాఘవ’ చిత్రం విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా వేడుకలో నేనుఎక్కువగా మాట్లాడకపోవడం అనేది నిజమే. దానికి కారణం ఎన్టీఆర్. ఎన్టీఆర్‌కి సంబంధించిన తండ్రి మరణం అనే గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఏం మాట్లాడినా మరలా ఆ గాయాన్ని, ఆ విషయాన్ని గుర్తు చేయడమే అవుతుంది. అందుకే తక్కువ మాట్లాడాను. హరికృష్ణ గారికి ఇలా జరిగింది.. అని తెలిసిన తర్వాత సినిమాని సమ్మర్‌కి వాయిదా వేద్దాం అని డిసైడ్ అయ్యాం. హరికృష్ణ కార్యక్రమాలు పూర్తయిన రెండో రోజే ఎన్టీఆర్ ఫోన్ చేసి అక్టోబర్11నే విడుదల చేద్దామని చెప్పాడు.
అనుకోకుండా సినిమాలో కూడా హీరో తండ్రి మరణించే సన్నివేశం. దానికి హీరో చితికి నిప్పుపెట్టే సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నాయి. నిజజీవితంలో తన తండ్రికి ఆ కార్యక్రమాలు చేసిన తర్వాత యాదృచ్చికంగా అవే సన్నివేశాలను ఎన్టీఆర్ షూటింగ్‌లో చేశారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఫ్యాక్షన్ అంటే యుద్దం మొదలయ్యే ఘట్టం, ఆ తర్వాత యుద్దం జరిగేటప్పుడు అంతా బాగుంటుంది. కానీ ఆ యుద్దాల తాలూకు పర్యవసానాలు మాత్రం ఎవ్వరికీ కిక్ ఇవ్వవు. అందుకే పురాణాలలో కూడా యుద్ద పర్వాలను బాగా చెప్పినా, చివరకు పర్యవసానాల గురించి వచ్చేటప్పటికీ ఏదో లాగించి ముగించేస్తారు. ఎందుకంటే ఆ యుద్దం తాలూకు పర్యవసానాలు మనలోని బతకాలని ఉండే ఆశను చంపివేస్తాయి. వాటి గురించి చెబితే కొత్త యాంగిల్ వస్తుంది కదా అని ఆలోచించి ఈ కథను తయారు చేశాను.
ఇక ఓ విషయాన్ని ఇంట్లో ఆడవాళ్లతో కంటే బయటి వారితో అంతా చర్చిస్తాం.ఒకవేళ ఇంట్లో ఆడవారితోనే కనుక చర్చిస్తే వారు చెప్పిందే వింటే హింస ఇంతదాకా రాదు. ఈ విషయాన్ని కూడా సినిమాలో చూపించాం.. అని చెప్పుకొచ్చాడు. నిజమే ఇందులో త్రివిక్రమ్ చెప్పింది అక్షరసత్యం. ఆడవాళ్ల వల్లనే యుద్దాలు జరుగుతాయి కానీ అదే ఆడదాని మాట వింటే హింస, ప్రతీకారాలు తగ్గుతాయి. ఇక యుద్దం జరిగిన పర్యవసానాలు చర్చిస్తే మహాభారతంలోని అర్జునుడి వైరాగ్యం, శ్రీకృష్ణుని భగవద్గీత, సామ్రాట్ అశోకుడు యుద్దంలో చనిపోయిన వారిని చూసి ఇలాంటివి వద్దని వైరాగ్యం పొందడటం అనే కోణంలో చిత్రం రూపొందించామని త్రివిక్రమ్ చెప్పేది వింటే నిజమని ఒప్పుకోవాల్సిందే.