నందమూరి హీరోలంటే క్రమశిక్షణకు మారుపేరు. సమయపాలన, ఎంతైనా కష్టపడే తత్వం, దేనికీ మరీ ముఖ్యంగా నటన విషయంలో రాజీపడని నైజం వారిది. నాటి నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. పౌరాణిక పాత్రల మేకప్ కోసం తెల్లవారుజామున 3గంటలకే రెడీ అయి, షూటింగ్ స్పాట్‌కి మేకప్‌తో సహా వెళ్లిపోవడం ఆయన నైజం. షూటింగ్‌కి ఆలస్యం అవుతుందని ముందుగా మేకప్‌తో పౌరాణిక పాత్రలో రెడీ అయి విమానంలో కూడా పయనించిన క్రమశిక్షణ నేటి వారికి ఆదర్శం. నా నుంచి లక్ష దోచుకుని పోయినా బాధపడను గానీ నా సమయాన్ని నిమిషం వృదా చేసినా ఒప్పుకోనని చెప్పే నైజం ఆయనది. అవే లక్షణాలు బాలకృష్ణ, హరికృష్ణలకే కాదు.. మనవడు చిచ్చరపిడుగు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ జీన్స్‌లో కూడా ఉన్నాయి. దానికి తాజాగా ‘అరవిందసమేత వీరరాఘవ’నే ఉదాహరణ.
తన తండ్రి హరికృష్ణ హఠాన్మరణంతో దిగ్బ్రాంతికి లోనై, వారం పాటు మామూలు మనిషి కాలేని ఎన్టీఆర్ వారం వెంటనే తన నిర్మాతలకు నష్టం రాకూడదని భావించి, షూటింగ్‌కి హాజరై సినిమాను అనుకున్న తేదీకే విడుదల కావడానికి ఎంతగా కష్టపడ్డాడో అనేది ఆయన నిజమైన వృత్తిగత క్రమశిక్షణకు ఉదాహరణ. అంతేకాదు.. ఎన్టీఆర్ షూటింగ్ స్పాట్‌కి వచ్చాడంటే ఎంత వ్యక్తిగత బాధల్లో ఉన్నా ఎంతో చలాకీగా, ఎంతో ఉత్సాహంతో పనిచేస్తూ, యూనిట్‌ని అంతా ఉత్సాహపరచడం ఆయన అంకిత భావానికి నిదర్శనం.
దీని గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ చెబుతూ, మరుసటి రోజు షూటింగ్‌కి మేకప్‌తో అయితే ఎన్నిగంటలకు రావాలి? మేకప్ లేకుండా అయితే ఇంకా ముందుగా ఎన్నిగంటలకు రావాలి? అని ఎన్టీఆర్ అడిగే వారు. ఓ స్టార్ హీరో నన్ను అలా అడగడం నాకెంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించేది. ఎన్టీఆర్ షూటింగ్ స్పాట్‌కి వచ్చిన వెంటనే అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయేది. ఆయనలోని ఉత్సాహం కారణంగా సెట్‌లోని వారంతా ఎంతో ఉత్సాహంగా పనిచేసేవారు. ఆయన సెట్‌లో ఉన్నంత వరకు ఎవరిలో కూడా నిరుత్సాహం, అలసత్వం కనిపించేవి కావు. ఆయన స్పీడుని అందరు అందుకోవడానికి ప్రయత్నించడంతోనే షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయింది. ఎన్టీఆర్ ఈజ్ అమేజింగ్.. అని చెప్పుకొచ్చాడు.