ఈ ఇంటర్నెట్ యుగంలో ఎవరి గురించి అయినా సమాచారం, పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఒకప్పటిలా వారి జీవిత చరిత్రలను సేకరించే పరిస్థితులు లేవు. అందరూ ఒకే ఒక్క క్లిక్‌తో వచ్చే ఫ్రీ ఆన్‌లైన్ ఎన్‌సైకోప్లీడియాల మీద ఆధారపడుతున్నారు. కానీ అలాంటి వీకీపీడియాలలో కూడా తప్పులు వస్తూ ఉంటే ఇక వాటిపై విశ్వాసంఎలా ఉంటుంది? అనేదే ప్రశ్న. ఇక ఇటీవల ‘ఆర్‌ఎక్స్100’ హీరో కార్తికేయ ‘దేవదాస్’ చిత్రం విడుదల సందర్భంగా నాగార్జున ఈ వయసులో కూడా హ్యాండ్సమ్‌గా ఉండటం గురించి మాట్లాడుతూ.. ఏమైనా ఆయన వీకీపీడియా ఆయన వయసును తప్పుగా చూపిస్తోందా? అంటూ నాగార్జున మీద పొగడ్తల వర్షం కురిపించాడు.
ఈ విషయంలో కార్తికేయ ఓ ప్రశంసగా వీకీపీడియా తప్పుగా చూపిస్తోందా? అని చేసిన కాంప్లిమెంట్ మరో టాప్‌స్టార్ విషయానికి వచ్చే సరికి నిజంగా తప్పులు చూపించింది. ఏకంగా నందమూరి బాలకృష్ణ పుట్టిన సంవత్సరంతో పాటు ఆయన మరణించాడని కూడా చూపించడంపై అందరు, ముఖ్యంగా బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు. బాలయ్య జన్మించింది 1960లో అయితే ఆయన 1913లో నవంబర్ 2వ తేదీన ఆర్సికెరేలో జన్మించాడని తెలపడమే కాదు.. ఏకంగా 1995 జులై19న బెంగుళూరులో బాలయ్య మరణించాడని చెప్పడం విస్తుగొలుపుతోంది.
బతికున్న వ్యక్తులను ఇలా మరణించినట్లు, అందునా తెలుగువారికి ఎంతో ఇష్టమైన టాప్‌స్టార్ విషయంలోనే ఇలా జరిగితే అది ఎంత మంది మనోభావాలను దెబ్బతీస్తుందో అర్ధమవుతుంది. ఇది వైరల్ అవుతూ ఉండటంతో బాలయ్య అభిమానులే కాదు అందరు దీనిపై ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తూ వారి నిర్లక్ష్యధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎవరో ఆకతాయి చేసిన పనిగా దీనిని అనుమానిస్తున్నారు. ఈ పొరపాటును వీకీపీడియా ప్రతినిధులకు అందరు తెలియజేయడంతో ఆ తప్పును సరిదిద్దారు.
వెంటనే బాలయ్యకి సంబంధించిన వాస్తవ వివరాలను అప్‌డేట్ చేశారు. కానీ గతంలో కూడా వీకీపీడియాలో పలువురు ప్రముఖుల వివరాలను తప్పుగా చూపించడం, ఒకరి స్థానంలో మరొకరి ఫొటోలను ఉంచడం తరుచుగా జరుగుతోంది. దీనిపై ఇకనైనా ప్రతినిధులు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిపై అందరికీ అసలు నమ్మకమే పోయే అవకాశం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.