తెలుగు సినిమాలకు రోజుకో కొత్త హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. వీరిలో బాలీవుడ్ నుంచి అన్నిభాషల వారు ఉంటారు. అలాగని పరిచయం అయిన అందరు స్టార్ హీరోయిన్లు అయిపోరు. పాపం.. మొదట్లో మాత్రం మీడియా అటెన్షన్ సాధించి ఫలానా స్టార్స్‌తో కలిసి నటించాలని ఉందని, ఆయా హీరోలు, దర్శక నిర్మాతల దృష్టిలో పడేందుకు నానా గిమ్మిక్కులు చేస్తుంటారు. కానీ కన్న కలలని నిజం చేసుకునే అవకాశం కొందరికే లభిస్తుంది. వీరిలో రెండో చిత్రానికి కూడా నోచుకోని వారు ఉంటారు.
ఇక విషయానికి వస్తే తెలుగులో ఆమె మూడు చిత్రాలలో నటించింది. కానీ ఆమె పేరును ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆయా చిత్రాలు విడుదల అయ్యాయో లేదో కూడా తెలియని పరిస్థితి. వాటి పేర్లు ఎవ్వరికీ గుర్తులేవు. అవే 'కన్నయ్య, ఖయ్యూం భాయ్, సత్యగాంగ్' చిత్రాలు. వీటిలో నటించిన రాజస్థానీ అమ్మడి పేరు హర్షిత. ప్రస్తుతం ఆమె రమేష్ చెప్పాల దర్శకత్వంలో సంజోష్ హీరోగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో రూపొందుతున్న 'బేవర్స్'లో నటించింది. ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హర్షిత మాట్లాడుతూ.. అన్ని రకాల పాత్రలు చేసి మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. 'బేవర్స్' చిత్రంలో ఆరాధ్య అనే పాత్రను పోషించాను. ఇందులో వాతావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే మంచి పాత్రను పోషిస్తున్నాను. ఇందులో కుటుంబ భావోద్వేగాలు, సందేశం, ప్రేమ, విలువలు అన్ని ఉన్నాయి. బాధత్య లేని కుర్రాడిగా హీరో కనిపిస్తాడు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. రాజేంద్రప్రసాద్ గారితో కలసి నటించడం అనేది అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. రవితేజ , పవన్‌గార్లు నా అభిమాన హీరోలు. వాళ్లతో కలసి పని చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో ఏ చిత్రాలు లేవు గానీ ఒక తమిళ చిత్రంలో నటిస్తానని చెప్పుకొచ్చింది.