రేపు విడుదల కానున్న 'నోటా' చిత్రం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం టైటిల్‌ని చూస్తేనే ఇది పొలిటికల్ థ్రిల్లర్ అని అర్దమవుతుంది. కేవలం ఐదు చిత్రాలతోనే సెన్సేషనల్ స్టార్‌గా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా విజయ్ దేవరకొండకి లభిస్తున్న క్రేజ్ చూసి నేటి యంగ్ హీరోలు, వారసత్వ హీరోలు కుళ్లుకునేలా పరిస్థితి ఉంది. 'పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం' వంటి చిత్రాలతో నటనలోనే కాదు.. యాటిట్యూడ్ పరంగా కూడా అందరిలో ఆసక్తిని రేపుతూ, చిరంజీవి ద్వారానే తనని తాను చూసుకుంటున్న అనుభూతి కలుగుతోందని, మరో స్టార్ ఆవిర్భవించాడని ఇతను కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. ఎంతో మేధావి అయిన అల్లు అరవింద్ కూడా విజయ్ ఎంతో తెలివైన వాడని, నాటి చిరు నిర్ణయాలలానే విజయ్ నిర్ణయాలు కూడా ఎంతో ముందస్తు ఆలోచనలతో ఉంటాయని చెప్పాడు.
ఇక విషయానికి వస్తే 'నోటా' చిత్రం తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని పలు పార్టీలు భయపడుతున్నాయి. కేతిరెడ్డి నుంచి పొంగులేటి సుధాకర్ వరకు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన జెఏసీ నేత హైకోర్టులో సినిమా ఆపాలని పిట్ వేశాడు. ఇక విజయ్ అంటే ఆయన బంధుత్వం కారణంగానే కాదు.. వి.హన్మంతరావు వంటి కాంగ్రెస్ సీనియర్లను కూడా ఆటపట్టించాడు. స్వతహాగా ఇతను ఏ కోణంలో చూసినా టిఆర్‌ఎస్‌కి అభిమానిగా కనిపిస్తున్నాడు. ఇది కూడా ఇతర పార్టీలలో సినిమాలో ఏదో ఉందనే కోణానికి కారణంగా మారుతున్నాయి. అందునా ఇందులో ఎన్టీఆర్, చంద్రబాబు, జయలలిత మరణం వంటి పలు అంశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇక 'నోటా'ని విడుదలకు ముందు ఎన్నికల కమిషన్ చూడాలనే అభిప్రాయం కూడా ఉంది. మొత్తానికి మరోసారి విజయ్ తన చిత్రానికి అన్ని విషయాలను ప్రమోషన్స్‌కు సరిగా వాడుకుంటున్నాడు. వేడుకలో సైతం మూడు నాలుగు వేలకి ఓట్లని అమ్ముకోమని తనతో పాటు అందరితో ప్రతిజ్ఞ చేయించాడు. ఇలా తనదైన శైలిని మరోసారి చూపిస్తున్న విజయ్‌కి అతి తక్కువ చిత్రాలతోనే పొలిటికల్ థ్రిల్లర్‌లో అందునా ముఖ్యమంత్రి వంటి బరువైన పాత్ర రావడం కూడా ఒక అదృష్టమే.
కాగా ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొస్తున్నాడు. తాజాగా 'పెళ్లిచూపులు' చిత్రం గురించి చెబుతూ, పెళ్లిచూపులు చిత్రం చేయాలని నన్ను ప్రేరేపించింది 'రెబెల్ వితౌట్ ఎ క్రూక్' అనే నవల. ఈ నవలను ఓఫ్రెంఢ్ ఇస్తే చదివాను. ఇందులోని నాయకుడు తాను అనుకున్నది సాధించడానికి కిడ్నీని సైతం అమ్ముకుంటాడు. ఎన్ని కష్టాలు పడి అయినా అనుకున్నది సాధించాలనే విషయం ఈ పుస్తకం ద్వారా నాకు తెలిసింది. ఆ సమయంలోనే 'పెళ్లిచూపులు' కథ నా వద్దకు వచ్చింది. ఎవ్వరమూ పారితోషికాలు తీసుకోకుండా, బాధ్యతలు పంచుకుంటూ ఎన్నో కష్టాలు పడి ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాం. మా కష్టానికి సురేష్‌బాబు రూపంలో అదృష్టం తోడవ్వడంతో మా దశ తిరిగిపోయింది అని చెప్పుకొచ్చాడు. నిజానికి ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం కూడా కలిసి రావాలనేది విజయ్‌ని చూస్తే అర్ధమవుతుంది..!