నిజంగా బిగ్‌బాస్ సీజన్2లో కౌశల్‌కి లభించిన మద్దతు కనివినీ ఎరుగనిది. ఓ స్టార్ హీరో రేంజ్‌లో ఆయన మేనియాలో ‘కౌశల్ ఆర్మీ’ పడింది. వారు నిర్వహించిన ప్రచారం, సోషల్‌మీడియాలో ప్రమోషన్, ఓట్ల రూపంలో ఆయనకు మద్దతుతో పాటు ఏకంగా 2కె రన్‌ని కూడా నిర్వహించింది. ఇక విషయానికి వస్తే కౌశల్ పూర్తి పేరు కౌశల్ మండా. ఈయన బుల్లితెర, వెండితెర నటుడు, వాణిజ్య ప్రకటనల దర్శకుడు, వ్యాపారవేత్త. అంతే కాదు మోడల్‌గా, నృత్యకళాకారునిగా, టెలివిజన్ హోస్ట్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయనది వైజాగ్. ‘ద లుక్స్ ప్రొడక్షన్స్’ అనే మోడల్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీకి వ్యవస్థాపకుడు. ఇప్పటి వరకు దాదాపు 250 యాడ్స్‌ని దేశంలోని అన్నిభాషల్లో రూపొందించాడు.
1983లో టివీ సీరియల్‌గా వచ్చిన ‘ఎవ్వని చెదనుంచు’తో బాలనటునిగా పరిచయం అయ్యాడు. ‘చక్రవాకం, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, సూర్యవంశం’ వంటి వాటి ద్వారా బుల్లితెరపై పేరు తెచ్చుకున్నాడు. ఇక వెండితెరపై మహేష్‌బాబు తొలిచిత్రం ‘రాజకుమారుడు’తో తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ‘శ్రీరామ్, ఆయుధం, వెంకీ, ఒకటవుదాం, అనుకోకుండా ఒకరోజు, కామెడీ ఎక్స్‌ప్రెస్, అనగనగా ఓ అరణ్యం, మిస్టర్ పర్‌ఫెక్ట్’ వంటి చిత్రాలలో నటించాడు. ఇక బిగ్‌బాస్2లో విజేతగా నిలిచి పెద్దమనసుతో ప్రైజ్‌మనీ రూ.50లక్షలను మహిళా క్యాన్సర్ బాధితులకు ఇచ్చాడు.
ఇక ఈయన తాజాగా మాట్లాడుతూ.. ‘‘నేను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లింది.. అక్కడ గట్టి పోటీని ఎదుర్కొంది మీ అభిమానాన్ని సంపాదించుకోవడం కోసమే. ఇప్పుడు చెప్పండి మీకోసం ఏమి చేయాలో? అని తన అభిమానులను అడిగాడు. దాంతో ఫ్యాన్స్ అంతా సినిమాలో హీరోగా మారాలి అని కోరడంతో అయితే తప్పకుండా మీ కోరికను నెరవేరుస్తాను. ఇక నుంచి దర్శకుల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నన్ను హీరోగా చేస్తానని ఏ దర్శకుడైనా వస్తే హీరోగా నా తడాఖా చూపిస్తాను. ఇంతకాలానికి నాకు బిగ్‌బాస్ ద్వారా బిగ్‌బ్రేక్ వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ ముచ్చట తీరుస్తాను. మీ అందరి సహకారంతో జీవితంలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తానని చెప్పుకొచ్చాడు. మరి శివబాలాజీకి రాని బ్రేక్ వెండితెరపై కౌశల్‌కి వస్తుందో లేదో చూడాలి..!