నటి కాజోల్, స్టార్ అజయ్ దేవగణ్‌లు వివాహం చేసుకుని చక్కగా సంసారం చేస్తున్నారు. ఇద్దరు ఇప్పటికే నటిస్తూనే ఉన్నారు. పెళ్లయిన తర్వాత నటించడానికి అజయ్ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని మాత్రం అప్పుడప్పుడు కాజోల్ చెబుతూ ఉంటుంది. ఇక కాజోల్ విషయానికి వస్తే ఆమె కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన చిత్రం 'దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే'. ఈ చిత్రం నాటి కుర్రకారును, యువతను పిచ్చెక్కించింది. అంతే కాదు.. వయసు పైబడిన వారిని కూడా తమ జ్ఞాపకాలలోకి తీసుకెళ్లింది. ఆ చిత్రంలో హీరోహీరోయిన్లుగానే తాము కూడా ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని నాడు ఎందరో భావించారు. షారుఖ్‌ఖాన్, కాజోల్‌లు నటించిన ఈ చిత్రంలో కాజోల్ సిమ్రాన్ పాత్రలో ఇరగదీసింది. ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా దర్శకుడు. ఎవర్‌గ్రీన్ క్లాసిక్ లవ్‌స్టోరీల జాబితాలో దీనిని కూడా అందరు చేరుస్తూ ఉంటారు. యష్‌రాజ్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం రికార్డులను బద్దలు కొట్టి దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. అయితే కాజోల్ కెరీర్‌లోనే దిబెస్ట్ అనిపించి, కెరీర్‌కి మైల్‌స్టోన్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని ఇప్పటి వరకు ఆమె భర్త అజయ్ దేవగణ్ చూడలేదనేది ఆసక్తికర విషయం. ఈ విషయాన్ని కాజోలే స్వయంగా చెప్పుకొచ్చింది.
తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, 'దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే' సినిమా విడుదల తర్వాత ఆ తరహాలోనే తాము కూడా పెళ్లిచేసుకోవాలని ఎన్నో జంటలు అనుకున్నాయి. సినిమాలో మాజోడీకి అందరు బ్రహ్మరథం పట్టారు. అజయ్ ఇంత వరకు ఆ చిత్రం చూడలేదు. ఎందుకు చూడలేదని ఆయనను ఎన్నోసార్లు అడిగాను. కానీ ఆయన సరైన సమాధానం చెప్పలేదు. ఓ కారణం ఉంది.. కానీ నేను దానిని చెప్పను. ఈ విషయంలో మీ మీడియా అజయ్‌ని ఆ ప్రశ్న ఎందుకు వేయరు? బహుశా ఆయన నిజం చెబితే నాకు కూడా తెలుస్తుంది.. కదా అని చెప్పుకొచ్చింది.
సహజంగా ఎంత పెద్ద స్టార్ అయినా తన భార్య మరో హీరోతో రొమాంటిక్ సీన్స్ చేసే సీన్స్‌ని చూడలేరు. అందునా ఆమె పక్కన నటించిన హీరో తనకంటే లవర్‌బోయ్, ఎంతో సహజంగా నటించే స్టార్ అయితే చూసేటప్పుడే కాస్త ఇగో అనిపించడం ఖాయం. బహుశా తన స్థానంలో షారుఖ్‌ని అజయ్ ఇప్పటికే ఊహించుకోలేకపోతున్నాడేమో? ఈ విషయంలో నిజం తెలియాలంటే అజయ్ నోరు విప్పాల్సిందే మరి... మరి మగ లక్షణం అంటే ఇదే సుమా..!