దేశరాజకీయాలలో, ఓటర్లలో కూడా చైతన్యం బాగా పెరిగింది. ఇక మన ఏపీకి వస్తే ఎన్టీఆర్ టిడిపిని స్థాపించి, రాజకీయాలు మొదలు పెట్టిన తర్వాత వచ్చిన విప్లవాత్మకమైన మార్పు ఏమిటంటే.. అంత వరకు మేధావులకే పరిమితమైన రాజకీయాలు, విశ్లేషణలు నేడు గ్రామాలలో రచ్చబండ వద్ద జరుగుతున్నాయి. మీడియా ఏదో తామే ప్రజల్లో, ఓటర్లలో చైతన్యం తెస్తున్నామని భావిస్తూ ఉండటం తప్పు. నేడు మీడియా కూడా ఇవ్వలేని, వారు పిలిచే సోకాల్డ్ విశ్లేషకుల కంటే గ్రామాలలోని రచ్చబండ రాజకీయ ముచ్చట్లలోనే ఎక్కువ పరిణతి కనిపిస్తోంది. అసలు ఎన్నికలు వచ్చిన నాలుగేళ్లు ఒక పార్టీ పాలన చూసిన ఓటరు వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలి అనేది ఏడాది ముందు నిర్ణయించుకుంటున్నాడు. డబ్బులు పంచితే అందరి వద్దా తీసుకుని, తనకి నచ్చిన వాడికే ఓటేసే పరిణతి వచ్చింది. దీనికి రెండు మూడు ఉదాహరణలను తీసుకోవచ్చు.
ఎన్టీఆర్‌కి ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి వేసిన నాదేండ్ల భాస్కర్‌రావు, రామ్‌లాల్ అనే గవర్నర్లకు, ఆ ఘటనకు కారణమైన ఇందిరాని కూడా ప్రజలు చిత్తు చేశారు. ఇందిరాగాంధీ మరణం తర్వాత కూడా ఎన్టీఆర్‌ని అంతటి సానుభూతి పవనాలలోనూ గెలిపించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీగా నిలిపారు. నేషనల్ ఫ్రంట్ నుంచి పలు వాటికి అదే కారణమైంది. ఇక ఎన్టీఆర్‌ని అల్లుడు చంద్రబాబు నాయుడే వెన్పుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాడని అందరు ప్రచారం చేసినా తదుపరి ఎన్నికల్లో కూడా ప్రజలు చంద్రబాబునే గెలిపించారు. కిందటి ఎన్నికల్లో అందరు జగన్ స్వీప్ చేస్తాడని భావిస్తే చంద్రబాబునే సీఎంని చేశారు. సమైక్యాంధ్రలో జరిగిన ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు నుంచి కాంగ్రెస్ లగడపాటి రాజగోపాల్‌ని పోటీకి పెడితే చిరంజీవి వంటివాడు నాడు చంద్రబాబుతో అశ్వనీదత్‌కి సీటు ఇప్పించినా చిరు అభిమానులు కూడా అశ్వనీదత్‌ని ఓడించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఓ ఊపు ఊపుతుందని భావిస్తే దానికి ఎన్నిసీట్లు వచ్చాయో తెలిసిందే.
ఇక జనసేనాని పవన్ విషయానికి వస్తే ఆయన ఇప్పటికీ తన మీటింగ్‌లకు వస్తున్న జనాలను, పవన్ వీరాభిమానులైన సినిమా అభిమానులనే నమ్ముకుంటున్నాడు తప్ప వాస్తవాలను విస్మరిస్తున్నాడా? అని చెప్పవచ్చు. జనసేన పార్టీని స్థాపించిన మొదట్లో తనకి పదవులు అక్కర్లేదని, అందుకే పోటీ చేయకుండా బిజెపి, టిడిపిలకు మద్దతు ఇచ్చానని, జగన్ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే తాను భావించానని చెప్పాడు. మరోసారి తనకు పదవి లేకపోయినా కూడా ప్రశ్నించడమే తన హక్కు అన్నాడు. ఇటీవల జనసేన ఏపీలో సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పాడు. ఇప్పుడు మరలా మాట మార్చాడు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తాము కీలక పాత్ర పోషిస్తామని, తమకు ఆరేడు సీట్లు వస్తాయని అందరు అనుకుంటున్నారని, ఎన్ని సీట్లు వచ్చినా అధికారం ఏర్పరచడంలో తమదే కీలకపాత్ర అని కర్ణాటకలోని మొన్నటి ఎన్నికలను, జెడియస్‌ని చూపి మురిసిపోతున్నాడు. ఇదంతా తనకు లగడపాటి చెప్పాడని అంటున్నాడు. నిజమే లగడపాటి మాటలకు, ఆయన చేసే సర్వేలకు ఎంతో విలువ ఉంది. మరి అలాంటి లడగపాటినే బహిరంగంగా జగన్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం టిడిపికి, చంద్రబాబుకి ఢోకా లేదని చెప్పాడు. మరి పవన్ మాత్రం కేవలం లగడపాటి తానే కీలకం అవుతానని తనకి మాత్రమే చెప్పాడని అంటున్నాడు.
కానీ దీనిని లగడపాటి చెప్పినట్లు ఎలాంటి వార్తలు రావడం లేదు. మరి లగడపాటి సలహాలు, తీర్పులపై అంత నమ్మకం ఉంటే ఉండవల్లి, సబ్బంహరి, హర్షకుమార్, లగడపాటి వంటి వారిని, చివరకు తనకెంతో ఇష్టమైన లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ వంటి వారితో కలిసి ముందుకు ఎందుకు వెళ్లడం లేదు? వారంతా జనసేనలో చేరడానికి ముందుగా ఆసక్తి చూపిన వారు మాత్రమే కాదు.. పవన్ ఆర్బాటంగా ప్రకటించిన కేంద్రం రాష్ట్రానికి ఎన్ని నిదులు ఇవ్వాలి? చంద్రబాబు ఇంతే ఇచ్చారని చేస్తున్న ఆరోపణలపై నిజనిర్దారణ కమిటీ వేసి ఉండవల్లికి ఎందుకు బాధ్యతలు అప్పగించాడు? కనీసం చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు డాక్టర్ మిత్ర, సమరం, కత్తిపద్మారావు, పరకాల ప్రభాకర్ వంటి మేధావులైనా ఉన్నారు? మరి పవన్ వెనుక వారు ఎందుకు లేరు? కేవలం పవన్ మాట మీద నమ్మకం లేకపోవడమేనని ఇప్పటికైనా పవన్ గ్రహిస్తే ఆయనకే మంచిది. అంతే గానీ చిలక జోస్యాలు నమ్ముతూ, చింతమనేని ప్రభాకర్ చెప్పినట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక పార్టీకి అధ్యక్షుడై ఉండి వ్యక్తిగతంగా తాను ఎవరిపై విమర్శలు చేయనని, వ్యవస్థను మాత్రమే ప్రస్తావిస్తానని చెప్పిన పవన్ నియోజకవర్గ సమన్వయ కమిటీ స్థాయి వ్యక్తిలా తనకేం అనిపిస్తే అది మాట్లాడటం, తనను ముగ్గురు చంపడానికి ప్రయత్నిస్తున్నారని, వారి పార్టీ కూడా తనకి తెలుసునని, కానీ వారు అధికార పక్షమో, విపక్షమో తెలియదని, ఇలా చంద్రబాబు, లోకేష్‌లపై ఆరోపణలు చేసి మరి వాటిని నిరూపించుకోలేని పవన్ ఇకనైనా పరిణతితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది..!