రామ్ చరణ్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా బడా మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న సై రా నరసింహ రెడ్డి సినిమా షూటింగ్ మొదలు పెట్టుకుని దాదాపుగా ఒక ఏడాది కావొస్తుంది. ఇప్పటి వరకు సై రా నరసింహారెడ్డి షూటింగ్ మాత్రం ఒక కొలిక్కి రాలేదు. కానీ సై రా గురించిన వార్తలు మాత్రం ఎప్పటికప్పుడు మీడియాని షేక్ చేస్తూనే ఉన్నాయి. పలు భాషా నటులు నటిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లనే ప్రచారం ఉంది. రామ్ చరణ్ చెప్పకపోయినా బన్నీ ఇచ్చిన క్లూతో సై రా బడ్జెట్ విషయంలో అందరితోపాటు మీడియా కూడా ఒక అంచనాకి వచ్చింది.
అయితే తాజాగా సై రా నరసింహారెడ్డి క్లైమాక్స్ ని మారుస్తున్నారని న్యూస్ తో పాటుగా సై రా సినిమాకి సంబందించిన ఒక యాక్షన్ సన్నివేశానికి గాను కోట్ల రూపాయలు కాదు కాదు 50 కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారని.. ఒక యాక్షన్ సన్నివేశానికి సై రా కోసం ఇంత బడ్జెట్ రామ్ చరణ్ పెడుతున్నాడని తెగ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సై రా నరసింహారెడ్డి షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. అక్కడే సినిమాకి కీలకమైన ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తున్నారని.... అందుకోసం విదేశీ ఫైట్ మాస్టర్లు కూడా పనిచేస్తున్నారని... ఈ యాక్షన్ సీన్ కే 50 కోట్ల ఖర్చంటూ తెగ ఊదర కొడుతున్నారు. అయితే జార్జియాలో సైరాకి సంబందించి కీలకమైన యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్న విషయం నిజమే కానీ.. ఆ యాక్షన్ సీన్ కి 50 ఖర్చన్నది అబద్ధమంటున్నారు.
అది కేవలం రూమర్ అని.. సై రాకి సంబందించిన కథలో నాలుగు హెవీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని.... ఫస్ట్ హాఫ్ లో రెండు, సెకండ్ హాఫ్ లో రెండుగా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. అయితే నాలుగు యాక్షన్ సన్నివేశాలకు కలిపి 50 కోట్ల ఖర్చు అవుతుందట. కానీ.. కేవలం జార్జియా ఫైట్ కే 50 కోట్లు కాదట. జార్జియాలో సై రా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేసే పని లేదు. అక్కడే పెద్ద పెద్ద కోటలున్నాయి. ఆ కోటలు సై రా యుద్ధ సన్నివేశాలకు పర్ఫెక్ట్ గా సెట్ కావడంతో అక్కడ షూటింగ్ చేస్తున్నారు సై రా బృందం. అంతేకాకుండా ఇక్కడి నుంచి జూనియర్ ఆర్టిస్టుల్ని తీసుకెళ్లే అవసరం కూడా లేదు. ఎందుకంటే అక్కడి జార్జియా ప్రజలనే బ్రిటీష్ సైన్యంగా ఉపయోగించుకోవచ్చు. మరి సెట్స్, జూనియర్ ఆర్టిస్ట్ ల ప్రయాణ ఖర్చులు ఇవన్నీ లేకపోతే ఇక ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. కానీ ఒక్క ఫైట్ కే 50 కోట్ల ఖర్చంటూ ప్రచారం జరగడంలో ఏదైనా పబ్లిసిటీ మాయాజాలం దాగుందేమో సైరా బృందానికే తెలియాలి.