మన స్టార్స్ ఇతర భాషల్లో పెద్దగా క్లిక్ కాకపోవడానికి కారణం వారు ఎంచుకునే చిత్రాలే. ఎందుకంటే వారు తెలుగులో స్టార్ హీరోలు. దాంతో వారు తెరపై అసందర్భ విరోచిత విన్యాసాలు చేసినా వారికి తెలుగులో ఉన్న క్రేజ్, ఇమేజ్ దృష్ట్యా ప్రేక్షకులు వాటిని ఆమోదిస్తారు. కానీ పరభాషా చిత్రాలలో మాత్రం వారేమీ స్టార్స్ కాదు. అలాంటప్పుడు ఇతర భాషల్లో నటించాలని ఆశిస్తే పెద్దగా హీరోయిజం లేని కథాబలం ఉన్న చిత్రాలలో చేస్తేనే వారిని పరభాషా ప్రేక్షకులు ఆదరిస్తారు. గతంలో చిరంజీవి తెలుగులో తనకున్న ఇమేజ్‌తోనే బాలీవుడ్‌లో కూడా చిత్రాలు చేశాడు. అది వారికి నచ్చలేదు. కాబట్టి రోమ్‌కి వెళ్లినప్పుడు రోమన్‌లా ఉండాలనే సామెత మన హీరోలకు బాగా సూటవుతుంది. ఇక అల్లుఅర్జున్ విషయానికి వస్తే ఆయన ఎప్పటి నుంచో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. దాని కోసం ఆయన లింగుస్వామిని దర్శకునిగా ఎంచుకోవాలని భావించాడు. కానీ అది కుదరలేదు. అదే సమయంలో తమిళ, తెలుగు భాషల్లో స్టార్ సూర్యతో '24' వంటి విభిన్నచిత్రం తీసిన విక్రమ్. కె.కుమార్‌తో కలిసి చేయాలని భావించాడు. కానీ అది కూడా బన్నీకి నచ్చలేదు.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం మురుగదాస్ శిష్యుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొంది అక్టోబర్ 5వ తేదీన విడుదల కానున్న 'నోటా' చిత్రం కథను విజయ్ దేవరకొండకు బదులు దర్శకుడు ఆనంద్‌శంకర్ ఈ కథని బన్నీకి చెప్పాడట. జ్ఞానవేల్ రాజాతో కూడా అల్లు కుటుంబానికి ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయాల నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో టిడిపి వ్యవస్థాపకుడు, నటస్వార్వభౌమ, స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, నేటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తమిళ ఎవర్‌గ్రీన్ నటి, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, అమ్మ, పురచ్చితలైవి జయలలిత ప్రస్తావన కూడా ఉంటుందిట.
తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు ఆనంద్‌శంకర్ మాట్లాడుతూ, 'బన్నీ కొంతకాలంగా ద్విభాషా చిత్రం చేయాలని అనుకుంటున్నారు. అందుకని ముందుగా నేను బన్నీని కలిసి ఈ స్టోరీ వినిపించాను. కథ చాలా బాగుంది కానీ ఇలాంటి కథ నాకు సరిపోదని బన్నీ నో చెప్పాడు. ఆ తర్వాత ఈ కథను విజయ్ దేవరకొండకి వినిపించాను. 'తమిళం'లో సినిమానా? అని విజయ్ కాస్త సందేహాన్ని వ్యక్తం చేశాడు. తర్వాత కథ కథనాలలోని కొత్తదనాన్ని చూసి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు... అని చెప్పుకొచ్చాడు. మరి ఈ చిత్రం కూడా సంచలన విజయం సాధిస్తే ఇక విజయ్‌కి తిరుగుండక పోవడమే కాదు.. తమిళంలో కూడా క్రేజ్ ఖాయం. ఎంతైనా బన్నీ వంటి వారు కూడా తమ ఇమేజ్‌ని పక్కనపెట్టి 'గీతగోవిందం, నోటా' వంటి కథాబలం ఉన్న చిత్రాలు చేస్తే బాగుంటుంది.