నిజానిజాలు తేలేదాకా ఎవరైనా కేవలం నిందుతులే తప్ప నేరస్థులు కాదు అనేది నిజం. తాను బాధితురాలినని ఓ మహిళ మరో వ్యక్తిపై ఆరోపణలు చేసినంత మాత్రాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నేరస్ధుడు కాదు.. బాధితులైనంత మాత్రాన నిజానిజాలు తేలకుండా వారిని బాధితులుగా కూడా పరిగణించలేం. సమాజంలో విభిన్న మనస్తత్వాలు, ఆలోచనలు ఉంటాయి. ఏ ఇద్దరి మనోభావాలు, స్పందన ఒకే విధంగా ఉండాలని లేదు. ఇక సినిమా నటులకు కూడా సామాజిక బాధ్యత అందరికంటే ఎక్కువ ఉంటుందనేది కూడా వాస్తవం. ఎందుకంటే వారు మాట్లాడే ప్రతి మాటా కోట్లాది ప్రజలు, అభిమానులు, సమాజంపై కూడా ప్రభావం చూపుతుంది. అలాంటప్పుడు అసలు నిజాలు నిగ్గుతేలకుండా ఏదో ఆరోపణలు వచ్చాయని ఏదేదో మాట్లాడేసి, తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడం కూడా సమంజసం కాదు. దాని వల్ల ఆ ప్రభావం సంబంధిత కేసుపై కూడా ప్రభావం చూపుతుంది.
ఇక విషయానికి వస్తే ఎంతో గొప్పవాడుగా పేరు తెచ్చుకున్న నానాపాటేకర్‌పై తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఇక్కడ తప్పు జరిగిందా? లేదా? అనేది ఇంకా రుజువు కాలేదు. నానా మాత్రం తాను ఏదేదో మాట్లాడనని, కేవలం చట్టపరంగా మాత్రమే చర్యలు తీసుకుంటానని తెలిపాడు. కానీ మీడియా అత్యుత్సాహం వల్ల ఈ విషయంలో చివరకు బిగ్‌బి బాధితునిగా మారిపోయాడా? అనే సందేహం రాకమానదు. మీడియా మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏదో సంఘటనపై ఎవరినో ఒకరిని రెచ్చగొట్టి మాట్లాడించి దాని ద్వారా విషయాన్ని మరింత పెద్దది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగని సమాధానం చెప్పకపోతే అదే రంగానికి చెందిన పెద్దమనిషివి నీకు సమాధానం తెలియదా? అంటారు. ఎవరో ఒకరి తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడితే దానిని మరింత పెద్దది చేస్తారు.
తాజాగా అమితాబ్‌బచ్చన్, అమీర్‌ఖాన్‌లు కలిసి నటిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో సమావేశమైన యూనిట్‌లోని అమితాబ్‌బచ్చన్‌ని ఓ విలేకరి ‘నానా పాటేకర్, తనుశ్రీ దత్తాల ఉదంతంపై మీ అభిప్రాయం ఏమిటి? ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కొంటున్న వేధింపులపై మీరేమంటారు?’ అని ప్రశ్నించాడు. కానీ సంయమనం కోల్పోని అమితాబ్ మాత్రం ఏదేదో వ్యాఖ్యలు చేయకుండా ‘నేను తనుశ్రీని కాదు.. నానాపాటేకర్‌ని అంత కన్నా కాదు. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడే నేను ఎలా కామెంట్ చేయగలను? అని ఆ విలేకరిని ప్రశ్నించాడు. కానీ ఆ విలేకరి మాత్రం..తోటి కళాకారులకు సంఘీభావం తెలిపే విధానం ఇదేనా? ఇలాంటి సమాధానం చెప్పి మన ఇండియన్ సూపర్‌స్టార్ మనల్ని సగౌరవంగా తలెత్తుకోలేకుండా చేశాడంటూ.. వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
ఎంతో హుందాగా ప్రవర్తించాల్సిన బిగ్‌బి ఇలా మాట్లాడటం సరికాదని, కథువా సంఘటన సమయంలో కూడా అమితాబ్ ఇలాగే స్పందించాడంటూ నెటిజన్లు బిగ్‌బిని ట్రోల్ చేస్తున్నారు. కథువా ఘటనలకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? కథువా ఘటనపై అమితాబ్ స్పందించకపోవడం ఖచ్చితంగా బాధ్యతా రాహిత్యమే. అక్కడి నిజాలు కూడా బయటపడినా ఖండించకపోవడం ఓ బాధ్యతాయుతమైన వ్యక్తిగా అమితాబ్‌కి సరికాదు. కానీ తనుశ్రీ, నానా విషయంలో మాత్రం అమితాబ్ స్పందనను తప్పు పట్టడం సరికాదు.