సినిమా సెలబ్రిటీలు బయటకి వస్తే వారిని చూడాలని ఉరకలు వేసే ఉత్సాహం చూపించి, తాము ఇబ్బందులు, ప్రమాదాలలో పడటమే కాదు.. తమ అభిమాన నటీనటులను కూడా ఇబ్బంది పెట్టడం సహజమే. ఇక్కడ ప్రతి నాణేనికి బొమ్మబొరుసు అనే రెండు కోణాలు ఉన్నట్లే ఇరువరి విషయంలోనూ తప్పులు, నిజాలు కూడా ఉంటాయి. వీలైనంత వరకు హీరోలు అభిమానులను ప్రశాంత వాతావరణంలో, వారికంటే ప్రత్యేక సమయం కేటాయించి సంతృప్తి పర్చడం తప్పితే ఆడియో వేడుకలు, సినిమా వేడుకలు, ఇతర పర్సనల్ టూర్స్ విషయంలో కూడా జనాలు తమను చూసేందుకు ఎంత ఎక్కువగా వస్తే అదే తమ క్రేజ్‌కి, ఇమేజ్‌కి గీటురాయిలా భావించరాదు.
అందుకే వెంకటేష్, పవన్‌కళ్యాణ్ వంటి వారు సినీ వేడుకలకూ, బర్త్‌డే వేడుకలకు కూడా దయచేసి వ్యయప్రయాసలు పడి ఎవ్వరూ రావద్దని, తమపై అభిమానం ఉంటే సినిమా చూడమని, బాగా నచ్చితే మరోసారి చూడమని అంతేగానీ తమకంటే మిమ్మల్ని నమ్ముకున్న వారు ముఖ్యమని చెబుతూ ఉంటారు. రజనీకాంత్ సైతం అభిమానులకు ఒక్కో ప్రాంతం వారికి ఒక్కో సమయం ఇచ్చి, భోజనం పెట్టి ఫొటోలు దిగి సైలెంట్‌గా పంపించి వేస్తుంటారు. ఇక విషయానికి వస్తే ఇటీవల కోలీవుడ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ కలిగిన స్టార్ విజయ్ పాండిచ్చేరిలో ఎమ్మెల్యే, తన అభిమాన సంఘాల నాయకుడి కుమార్తె వివాహానికి హాజరయ్యాడు. విజయ్ వస్తున్నాడని సదరు వ్యక్తి విపరీతంగా ప్రచారం చేయడంతో విజయ్‌ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
ఆ తొక్కిసలాటలో విజయ్‌కి కూడా గాయాలయ్యాయి. పెళ్లికి వచ్చిన వారి సన్నిహిత బంధువులకు కూడా తీవ్ర అసౌకర్యం కలిగింది. దాంతో ఇకపై తాను ఎవ్వరి వివాహ వేడుకలకు వెళ్లకూడదని విజయ్ నిర్ణయించుకున్నాడట. మరీ తప్పదు అనుకుంటే ఆ జంటను తన ఇంటికి తానే స్వయంగా ఆహ్వానించి బహుమతులు, ఫొటో సెషన్స్ జరపాలని నిర్ణయించుకుని ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాడని తెలుస్తోంది. మొత్తానికి ఆలస్యంగా అయినా విజయ్ మంచి నిర్ణయమే తీసుకున్నాడని చెప్పాలి.